తెరాసతో పొత్తు: సోనియా జోక్యం, ఢిల్లీకి కెకె
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకునే విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పొత్తుకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాకరిస్తున్న స్థితిలో సోనియా గాంధీ స్వయంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె కెసిఆర్‌తో మాట్లాడి తెలంగాణలో పొత్తుకు అంగీకరింపజేసే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో పొత్తు పెట్టుకోకపోతే తమకే కాకుండా తెరాసకు కూడా నష్టమని సోనియా బావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం, బిజెపి తమ ఒంటరి పోరు ద్వారా ప్రయోజనం పొందకుండా చూసే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. పొత్తులపై చర్చలకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కేశవరావు ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసిన విషయం తెలిసిందే.

సోనియా జోక్యం చేసుకోవడంతో పొత్తులపై చర్చలకు కేశవరావు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. కేశవరావు సోనియా గాంధీకి, కాంగ్రెసు అధిష్టానానికి అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిదే. తెరాసతో పొత్తుకు ద్వారాలు మూసుకుని పోలేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వంటి నాయకులు చెప్పిన నేపథ్యంలో కెకె ఢిల్లీ యాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తెరాసతో తమతోనే ఉందని, కచ్చితంగా పొత్తు ఉంటుందని కాంగ్రెసు నాయకులు ఇప్పటికీ చెబుతున్నారు. అయితే, తెరాస నాయకులు మాత్రం పొత్తుకు సిద్ధంగా లేరు. కాంగ్రెసు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించే వరకు పొత్తుపై ఊగిసలాట కొనసాగుతుందని అంటున్నారు. వచ్చే నెల మొదటివారంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్న కేశవరావు కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications