నవంబర్ 25 ముహూర్తం: అసెంబ్లీకి ఒక్కసారే
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లును వచ్చేనెల 25కల్లా రాష్ట్ర అసెంబ్లీ పరిశీలనకు పంపాలని కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అనుకోని అవాంతరాలు వస్తే తప్ప ఆ తేదీ ఖాయమైనట్లు చెబుతున్నారు. జీవోఎంలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ మంత్రి ఒకరు హోం శాఖలోని సీనియర్ అధికారులకు ఈ మేరకు సూచనలు జారీచేసినట్టు వివరించాయి.
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) శనివారం ఢిల్లీలో సమావేశమైంది. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దీనికి అధ్యక్షత వహించారు. నవంబరు 7 నాటికి కసరత్తు పూర్తిచేసి, తర్వాత ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేయనున్నట్టు జీవోఎం సంకేతాలిచ్చింది. ముసాయిదా బిల్లును రూపొందించిన తర్వాత దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపిస్తుంది. ఆయన దాన్ని రాష్ట్ర అసెంబ్లీ పరిశీలనకు పంపిస్తారు. విభజన బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు పది రోజుల సమయం నిర్దేశించనున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాలు వివరించాయి. అంటే డిసెంబరు 5కల్లా బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది.

సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు చివరి వారంలో మొదలై డిసెంబరు చివరివారం దాకా జరుగుతాయి. శీతాకాల సమావేశాల్లో ఎలాగైనా రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టాలని యుపిఎ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే అప్పటికల్లా అసెంబ్లీ అభిప్రాయ సేకరణ ప్రక్రియను ముగించాలని కేంద్రం భావిస్తోందని, తాజా టైంటేబుల్ కూడా దీన్నే ద్రువపరుస్తోందని అంటున్నారు.
విభజన వ్యవహారం రెండు సార్లు (తీర్మానం, ముసాయిదా బిల్లు) అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని, ఒక్కసారి మాత్రమే వస్తుందని అర్థమవుతోంది. అసెంబ్లీ తీర్మానం అనేది ఉండదని, వచ్చేది ముసాయిదా బిల్లు మాత్రమేనని అంటున్నారు. కొత్త రాష్ట్రం (తెలంగాణ) పేరు, విస్తీర్ణం (భౌగోళిక స్వరూపం), సరిహద్దులు అనే మూడు అంశాలను మాత్రమే ఇందులో ప్రధానంగా పేర్కొనే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని, హైదరాబాద్ ప్రతిపత్తి గురించి కూడా ఉంటే ఇందులో ప్రస్తావన ఉండవచ్చని వివరించాయి.
అసెంబ్లీ అభిప్రాయం తీసుకునే ప్రక్రియ ఓ వైపు సాగుతుండగానే జీవోఎం పని కొనసాగిస్తుంది. నదీ జలాలు, ఆస్తులు, అప్పులు, విద్యుత్ పంపిణీ తదితర కీలకాంశాలపై నిపుణుల కమిటీతో చర్చించి మార్గదర్శకాలు రూపొందిస్తుందని అంటున్నారు. నవంబరు మూడో వారానికల్లా ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. వీటన్నింటి ఆధారంగా రూపొందించే సమగ్ర విభజన బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications