నోబెల్, ఇంకా...: దీనికీ జగనేనా, అసలు చంద్రబాబుకేమైంది?

చంద్రబాబు చేసిన నోబెల్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. ఆయన పొంతలేని మాటలకు వాస్తవ పరిస్థితికి ఏమైనా సంబంధం ఉందా అని విశ్లేషిస్తున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేషమైన రాజకీయానుభవం కలిగిన నాయకుడు. మాట తొట్రుపడేది కాదు. ఈ విషయం సీనియర్ తెలుగు జర్నలిస్టులందరికీ తెలుసు. కానీ ఇటీవలి కాలంలో ఆయన పొంతన లేని వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విజయ పరిజ్ఞానం కూడా లేనట్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటనపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు. ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి ఇస్తానంటూ ఆయన బుధవారం అన్నారు.

చంద్రబాబు ఆ మాట ఎందుకన్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముఖ్యమంత్రిగా విశేషమైన అనుభవం ఉన్న ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా మాట్లాడారా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. నిస్పృహతో ఆయన వేగిపోతున్నారా, అందుకే ఆలా మాట్లాడుతున్నారా అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తానని....

ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తానని....

అమరావతిలో 2018లో ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తానని చంద్రబాబు గతంలో ఓసారి ప్రకటించారు. నిజానికి నాలుగేళ్లకు ఓసారి జరిగే ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ఎనిమిదేళ్ల ముందే నిర్ణయిస్తారు. ఒలింపిక్స్ నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటితో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధమైన సంబంధం ఉండదు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలతో కూడిన వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

వంద కోట్లు ఇస్తానని....

వంద కోట్లు ఇస్తానని....

నోబెల్ బహుమతి తీసుకుని వస్తే తాను రూ.100 కోట్లు ఇస్తానని తిరుపతి సైన్స్ కాంగ్రెసులో చంద్రబాబు అన్నారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశ్వవిద్యాలయాల్లో కనీస వసతులు కూడా కూడా కల్పించకుండా వంద కోట్ల రూపాయలు ఇస్తానని అనడాన్ని నెటిజన్లు తప్పు పట్టారు.

రోడ్లపై నడవొద్దు....

రోడ్లపై నడవొద్దు....

తన పాలన నచ్చకపోతే తాను వేసిన రోడ్లపై నడవకూడదని, తాను ఇచ్చే పెన్షన్లు తీసుకోకూడదని చంద్రబాబు అనడం వివాదంగా మారింది. ఒలింపిక్స్ గురించి ఆయన పొరపాటును మాట్లాడి ఉండవచ్చు గానీ ఈ ప్రకటన వెనక ఉన్నదేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆయనలోని తీవ్రమైన నిస్పృహకు ఇది అద్దం పడుతుందని అంటున్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనపై కూడా నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మేం చెల్లించిన పన్నులు మాకు ఇచ్చేయాలి వంటి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి.

జగన్ పార్టీయే కారణమా...

జగన్ పార్టీయే కారణమా...

సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులపై చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. తనకు వ్యతిరేకంగా ఏది జరిగినా దాని వెనక జగన్ ఉన్నాడని నిందించడం తెలుగుదేశం పార్టీ నాయకులకు, మంత్రులకు అలవాటుగా మారింది. పేస్‌బుక్ వ్యాఖ్యలకు నిందితులను చేస్తూ రవికిరణ్ రెడ్డితో పాటు మరొకరిపై పోలీసులు కేసులు పట్టిన విషయం తెలిసిందే. వారిని జగన్ పెంచిపోషిస్తున్నారని, అందుకే కక్షపూరితంగా ప్రభుత్వాన్ని ఆభాసు పాలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం నాయకులు విరుచుకుపడ్డారు. తాజా ప్రకటనపై సోషల్ మీడియాలో చోటు చేసుకుంటున్న వ్యాఖ్యలకు కూడా జగన్‌నే నిందిస్తారా అనేది ప్రశ్న.

పార్టీలో లుకలుకలు...

పార్టీలో లుకలుకలు...

చంద్రబాబులో నిస్పృహ, అసంతృప్తి చోటు చేసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. జగన్‌ను దెబ్బ తీసే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులను అనాలోచితంగా పార్టీలోకి తీసుకున్నారు. దాంతో జిల్లాల్లో, ఇంకా చెప్పాలంటే నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు ఏర్పడ్జాయి. కొత్త వచ్చిన నాయకులకు, అంతకు ముందే నుంచే పార్టీలో ఉన్న నాయకులకు మధ్య సయోధ్య కుదరడం లేదు. చంద్రబాబు ఎంతగా నచ్చజెప్పినా ఇరు వర్గాలు సహకరించకోవడానికి ముందుకు రావడం లేదు. జగన్‌ను దెబ్బ కొట్టాలనే వ్యూహం తనపైనే తిరగబడడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

నంద్యాల దెబ్బ....

నంద్యాల దెబ్బ....

చంద్రబాబుకు నంద్యాల ఉప ఎన్నిక దెబ్బ తీవ్రంగానే పడినట్లుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన మంత్రి అఖిలప్రియతో పొసగక శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో చేరిపోయారు. పైగా, ఏకగ్రీవం అవుతుందనుకున్న నంద్యాల ఉప ఎన్నిక పోటీ పడే పరిస్థితిని తెచ్చిపెట్టింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వైసిపి తరఫున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. దాంతో నంద్యాలలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో చక్రం తిప్పడానికి సిద్ధమయ్యారు. వైసిపి తరఫున గెలిచిన మరుక్షణం టిడిపిలోకి జంప్ చేసిన నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి చురుగ్గా పనిచేసే పరిస్థితి లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. దీంతో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం చంద్రబాబుకు అంత సులభమేమీ కాకుండా పోయింది. అది ఒక రకంగా ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. నంద్యాలలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రి అఖిలప్రియ అనుభవం సరిపోతుందా అనేది ఆనుమానమే.

 ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లాలో పార్టీలోకి కొత్తగా వచ్చిన శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌ వర్గానికి, టిడిపి సీనియర్ నేత కరణం బలరాం కృష్ణమూర్తికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు వర్గాలు భౌతిక దాడులకు కూడా పాల్పడ్డాయి. భవిష్యత్తులో, అంటే 2019 ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చు. ఇరు వర్గాలకు మధ్య సయోధ్య కుదర్చడం సాధ్యం కాదని బహుశా చంద్రబాబుకు కూడా తెలిసిపోయి ఉంటుంది.

జమ్మలమడుగులో...

జమ్మలమడుగులో...

జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు టిడిపిలోకి తీసుకున్నారు. మొదటి నుంచీ టిడిపిలో ఉన్న రామసుబ్బారెడ్డి మాటను కాదని ఆయన ఆ పనిచేశారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదరడం గగనమే. ఇది కూడా చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంది. ఎన్నికలు వచ్చేనాటికి ఇక్కడి పరిస్థితి మారిపోయే ప్రమాదం లేకపోలేదు.

విశాఖలో...

విశాఖలో...

విశాఖపట్నం జిల్లాలో మంత్రులు గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్న పాత్రుడికి మధ్య విబేదాలు సద్దుమణగడం లేదు. విశాఖపట్నం జిల్లాలో ఇటీవల బయటపడిన భారీ భూకుంభకోణం నేపథ్యంలో కూడా ఈ విబేదాల జాడ కనిపించింది. ఈ భూకుంభకోణం విషయంలో తనయుడు, మంత్రి నారా లోకేష్‌పై కూడా తీవ్రమైన ఆరోపణలు రావడం చంద్రబాబును అసహనానికి గురి చేస్తోందని అంటున్నారు.

సమస్యలు ఇలా....

సమస్యలు ఇలా....

రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఏదో సమస్య ముందుకు వచ్చి తనను చిక్కుల్లో పడేసే పరిస్థితిని కల్పించడం కూడా చంద్రబాబును అసహనానికి గురి చేస్తున్నట్లు చెప్పవచ్చు. తాజాగా గంగపర్రులో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం చిన్న సమస్యేం కాదు. అంతకు ముందు, కిడ్నీబాధితుల సమస్యలు ముందుకు వచ్చాయి. అమరావతికి భూసేకరణ నుంచి ఆక్వా పార్కుకు భూసేకరణ వరకు పలు సమస్యలు ముందుకు వచ్చి ఆయనను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా వివాదం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తెచ్చి పెట్టే అవకాశాలు లేకపోలేదు.

నిజానికి,

నిజానికి,

చంద్రబాబు మాటకు తెలుగుదేశం పార్టీలో ఎదురు ఉండేది కాదు. కానీ, మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు బయటపడిన అసమ్మతి ఆయనను సవాల్ చేసేదే. టిడిపికి అత్యంత విశ్వాస పాత్రుడని భావించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బొండా ఉమామహేశ్వర రావు వంటి పలువురు శాసనసభ్యులు చంద్రబాబుపై ఎదురు తిరిగినంత పని చేశారు. దీంతో చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోతున్నారనే అబిప్రాయం ముందుకు వచ్చింది.

వారంతా సైలెంట్....

వారంతా సైలెంట్....

వైసిపిలో ఎమ్మెల్యే రోజాది పెద్ద గొంతు. చంద్రబాబుపై, నారా లోకేష్‌పై, చంద్రబాబు ప్రభుత్వంపై నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. దాంతో రోజాను చిక్కుల్లో పడేయడానికి టిడిపి ఎమ్మెల్యే అనిత ముందుకు వస్తూ ఉండేవారు. రోజాను కట్టడి చేయడానికి అదే స్థాయిలో అనిత కయ్యానికి కాలు దువ్వుతూ వచ్చారు. ప్రస్తుతం అనిత అంత జోరు ప్రదర్శించడం లేదు. అలాగే, కాపు నేత ముద్రగడ పద్మనాభంపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు నోరు చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా పెద్దగా మాట్లాడుతున్నట్లు లేరు. మంత్రి పదవులు రాకపోవడం వల్లనే వారు వెనక్కి తగ్గారనే మాట వినిపిస్తోంది. దీంతో రోజాను, ముద్రగడను ఎదుర్కునే బలమైన గొంతులు చంద్రబాబుకు అందుబాటులో లేకుండా పోయాయని అంటున్నారు.

వ్యతిరేకమవుతున్న వర్గాలు...

వ్యతిరేకమవుతున్న వర్గాలు...

చంద్రబాబుకు వివిధ సామాజిక వర్గాలు వ్యతిరేమవుతున్న సూచనలు కనిస్తున్నాయి. కృష్ణారావు తాజా తిరుగుబాటు తెలుగుదేశం పార్టీని కలవరానికి గురి చేశాయి. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనేకన్నా, తన వర్గానికి అనుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని వైయస్సార్ కాంగ్రెసు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. కోన రఘుపతి బ్రాహ్మణుల సమావేశం ఏర్పాటు చేసి వారిని కూడగట్టే ప్రయత్నం చేశారు. అదే విధంగా కాపులు కూడా చంద్రబాబుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని సమస్యలు వివిధ వర్గాలను చంద్రబాబుకు దూరం చేసే పరిస్థితి కల్పిస్తున్నాయని అంటున్నారు.

ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కల్యాణ్....

ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కల్యాణ్....

రాష్ట్రంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు గొంతు విప్పుతూ చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తనకు సొంత మీడియా ఉండడంతో జగన్‌కు కలిసి వస్తోంది. మరోవైపు, పవన్ కల్యాణ్ సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతానంటూ ముందుకు వస్తున్నారు. ఆయన చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పలేని స్థితి. ఈ ఇద్దరు నాయకులను ఎప్పటికప్పుడు ఎదుర్కోవడం కూడా చంద్రబాబుకు అంత సులభం కావడం లేదు. జగన్‌పై చేస్తున్న అవినీతి ఆరోపణల వ్యాఖ్యలు ఏ మేరకు పనిచేస్తాయనేది చెప్పలేని స్థితి. తెలుగుదేశం పార్టీలో గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలను జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఆ ప్రయత్నాలు కార్యరూపం దాలిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. నంద్యాల ఉదంతమే అందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

బిజెపితోనూ...

బిజెపితోనూ...

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో స్నేహాన్ని కాపాడుకోవడం కూడా చంద్రబాబుకు కత్తి మీద సాము మాదిరిగానే మారింది. ఏ అంశం మీదనైనా సరే, చంద్రబాబు దిగిరావాల్సిన పరిస్థితే తప్ప కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా విషయమే ఆ విషయాన్ని తెలియజేస్తోంది. బిజెపితో దోస్తీని కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండును వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు, బిజెపిలోని ఓ వర్గం చంద్రబాబుతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివ రావు, సోము వీర్రాజు వంటి నేతలు చంద్రబాబుతో కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు తమ వ్యాఖ్యలతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు

తనయుడు చూస్తే అలా....

తనయుడు చూస్తే అలా....

జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు నెట్టేసి పార్టీని తన తనయుడు నారా లోకేష్‌కు అప్పగించడానికి తాను చేసిన ప్రయత్నంలో చంద్రబాబు సఫలమయ్యారనే అంచనా ఉంది. అయితే, నారా లోకేష్ ప్రసంగాలు ఎప్పటికప్పుడు నెటిజన్లకు అస్త్రాలుగా మారుతూనే ఉన్నాయి. టిడిపి తరఫున పివి ప్రధాని అయ్యారని నారా లోకేష్ చేసిన ప్రకటన నెటిజన్లకు మంచి ఉప్పును అందించింది. గతంలో ఆయన చేసిన పలు వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో జోకులు పేలాయి. ఆయన తడబాటు, పొరపాటు కూడా చంద్రబాబుకు అంతగా జీర్ణం కావడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Recommended Video

    అప్పుడలా ఉండేది....

    అప్పుడలా ఉండేది....

    గతంలో మీడియా చాలా పరిమితంగానే ఉండేది. అది కూడా తెలుగుదేశం పార్టీకి, అందునా చంద్రబాబుకు అనుకూలంగా ఉండేది. ఉదయం దినపత్రిక మూతపడిన తర్వాత దాదాపుగా మీడియా ఏకపక్షంగా మారింది. జగన్ సాక్షి మీడియాను ప్రారంభించిన తర్వాత కాస్తా పరిస్థితి మారింది. అయితే, ప్రభుత్వంపై లేదా చంద్రబాబుపై లేదా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడమే సాక్షి మీడియా పనిగా మారిందంటూ కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే, సోషల్ మీడియా విస్తృతం కావడంతో పరిస్థితి మరింతగా మారింది. నిజానికి, చంద్రబాబు నోబెల్ వ్యాఖ్యలపై సాక్షి మీడియా కాస్తా ఆలస్యంగానే ప్రతిస్పందించింది. అందుకు సంబంధించిన వార్తాకథనాలు తొలుత న్యూస్ వెబ్‌సైట్లలో వచ్చాయి. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోనూ కూడా ఆ వెబ్‌సైట్లు పోస్టు చేశాయి. దాంతో తానలా అనలేదని చంద్రబాబు చెప్పుకోవాడనికి వీలు లేకుండా పోయింది. సోషల్ మీడియా విస్తరించడం కూడా చంద్రబాబుకు కష్టాలను తెచ్చిపెడుతోంది. ఏమైనా అన్నీ కలగలిసి చంద్రబాబును నిరాశానిస్పృహలకు, అసహనానికి గురి చేస్తున్నాయని, అందువల్లనే ఆయన పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, మీడియా సమావేశాల్లో కూడా సభల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+