తెగబడుతున్న పాక్: ఖాళీ అవుతున్న ఇళ్లు
జమ్మూ: పాకిస్తాన్ తన దుశ్చర్యలను ఆపడం లేదు. భారత్ తిప్పికొడుతున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ బలగాలు కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గత సోమవారం అర్థరాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు సాగిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా బిఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యం చేసుకుని జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ బలగాలు ఫిరంగి కాల్పులకు తెగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ బలగాలు బిఎస్ఎఫ్ పోస్టులను మాత్రమే కాకుండా గూడేలను కూడా లక్ష్యం చేసుకున్నాయి. దాదాపు 60 గూడేలపై పాకిస్తాన్ బలగాలు విరుచుకుపడినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలియజేస్తోంది. గత రాత్రి నుంచి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో, ఫిరంగి దాడుల్లో పౌరులెవరూ గాయపడలేదు. సోమవారం నాడు హిరానగర్‌లో పాకిస్తాన్ ఫిరంగ దాడిలో ఓ బిఎస్ఎఫ్ జవను మరణించాడు.

నూతన సంవత్సరం సందర్భంగా పాకిస్తాన్ బలగాలు చేసిన దాడిలో నలుగురు జవాన్లు, ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. భారత్ జరిపిన ఎదురుదాడిలో ఐదుగురు పాకిస్తాన్ రేంజర్లు మరణించారు. పాకిస్తాన్ దాడులతో సరిహద్దు గ్రామాల్లోని దాదాపు పదివేల మంది ఇళ్లను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. పౌర ప్రాంతాలపై పాకిస్తాన్ బలగాలు చేస్తున్న విచక్షణా రహితమైన దాడుల కారణంగా సాంబా, కథువా జిల్లాల్లో ప్రజలు ఇళ్లు వదిలిపోతున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
సురక్షిత ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో దాదాపు పది వేల మంది ఉన్నారని, వారి వలసలు మంగళవారంనాడు కూడా కొనసాగుతూనే ఉన్నాయని అధికారులు చెప్పారు. పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నట్లు సీనియర్ అధికారి చెప్పారు.
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారంనాడు పాకిస్తాన్ కాల్పులపై, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. సరిహద్దు గ్రామాల్లో పౌరుల ఆస్తులకు జరుగుతున్న నష్టంపై కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications