వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో కెసిఆర్ హ్యాపీ: తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆత్మగౌరవ నినాదం కూడా ముఖ్యమైంది. కెసిఆర్ తన ఆత్మగౌరవాన్ని సాధించుకోవడంలో నెగ్గవచ్చు గానీ మిగతా తెలంగాణవాదుల మాటేమిటనేది ప్రశ్న.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇరువురు ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావుకు, నారా చంద్రబాబు నాయుడికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటూ వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, లేదంటే తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని చంద్రబాబు అంటూ వచ్చారు.

అయితే, కెసిఆర్ వాదన మరో రకంగా ఉంటూ వచ్చింది. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం తనకు ఇవ్వడం లేదని చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరుగుతూ వచ్చారు. హైదరాబాద్ విషయంలోనూ ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య వాగ్వివాదం జరుగుతూ వచ్చింది.

పదేళ్ల వరకు తమకు హైదరాబాద్‌పై హక్కు ఉందని చంద్రబాబు వాదిస్తూ వస్తుంటే పదేళ్లు ఇక్కడి నుంచి పాలన చేయడానికి మాత్రమే చంద్రబాబుకు అవకాశం ఉంది తప్ప అది హక్కు కాదని కెసిఆర్ వాదిస్తూ వచ్చారు. ఈ ఘర్షణ వాతావరణంలో కెసిఆర్ వైపు తెలంగాణ మేధోవర్గం ఉంటూ వచ్చింది.

ఇరువురి మధ్య ఘర్షణ...

ఇరువురి మధ్య ఘర్షణ...

చంద్రబాబు, కెసిఆర్ మధ్య వివాదం కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పట్లో తలనొప్పిగా మారింది. ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. ఇరువురి మధ్య భేటీలు ఏర్పాటు చేశారు. ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో మాట్లాడుకున్నప్పటికీ చాలా కాలం వరకు సయోధ్య కుదరలేదు.

వెంకయ్య ప్రధాన పాత్ర

వెంకయ్య ప్రధాన పాత్ర

కెసిఆర్, చంద్రశేఖర రావు మధ్య సయోధ్యకు కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇరువురి మధ్య అవగాహనకు ప్రాతిపదిక ఏర్పడినట్లు చెబుతున్నారు. కెసిఆర్ కూడా వెంకయ్య నాయుడితో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు కాబట్టి అది పెద్ద సమస్యగా తయారు కాలేదు. దాంతో గవర్నర్ ప్రయత్నం మేరకు ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు.

అమరావతి శంకుస్థాపనకు

అమరావతి శంకుస్థాపనకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు కెసిఆర్‌ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి కెసిఆర్ వెళ్లి నాలుగు మంచి మాటలు చెప్పారు. దీంతో ఇరువురి మధ్య అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా కెసిఆర్‌కు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవం ఇచ్చి సమాన హోదాతో చూడడం ప్రారంభమైందని అంటారు.

నోటుకు ఓటు కేసు...

నోటుకు ఓటు కేసు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ముట్టజెప్పుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో పూర్తిగానే పరిస్థితి మారిపోయింది. హైదరాబాదులో ఉండి ఆంధ్రప్రదేశ్ పాలన చేయలేమని భావించిన చంద్రబాబు తన మకాంను విజయవాడకు మార్చేశారు. ఓటు నోటు కేసుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేకుండా పోయింది. పలువురు టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోయారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక....

తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక....

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస యాదవ్‌కు కెసిఆర్ మంత్రి పదవి ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాసలో చేరడానికి ముందు తాను నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఇరువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇరువురు కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు. కానీ వేర్వేరు సమయాల్లో వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెరాసలో చేరడమే కాకుండా మంత్రి పదవిని కూడా చేపట్టారు. రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కలిసి వచ్చినా తీసుకోవాలనే ఒక భావనతో తెలంగాణవాదులు సరిపెట్టుకున్నారు.

రామోజీ రావు నివాసానికి...

రామోజీ రావు నివాసానికి...

కెసిఆర్ స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ నివాసానికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సేపు ఆయన గడిపారు. తెలంగాణ ఉద్యమానికి ముందు రామోజీ రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ ఆ తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. నాగళ్లు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీని దున్నిస్తానని చెప్పారు. అయితే, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీ పట్ల వైఖరి మార్చుకుని ఆయనతో సయోధ్యకు వచ్చారు. తెలంగాణలో రామోజీ రావు తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి రక్షణ బాధ్యత కెసిఆర్‌దే అవుతుంది. అయితే, రామోజీ రావుకు అడిగిన వెంటనే వందల ఎకరాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉదయించింది. దీన్ని తెలంగాణ వాదులు ప్రశ్నించారు కూడా. దాన్ని కెసిఆర్ పట్టించుకోలేదు. అయినా తెలంగాణవాదులు సరిపెట్టుకున్నారు.

తాజాగా రాధాకృష్ణతో....

తాజాగా రాధాకృష్ణతో....

రామోజీ రావుతో సయోధ్య తర్వాత ఈనాడును మచ్చిక చేసుకున్న కెసిఆర్ ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణతో సయోధ్యకు సిద్ధపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు అనిపిస్తూనే తెలంగాణ వ్యతిరేక కార్యకలాపాలకు ఆంధ్రజ్యోతి పత్రిక ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందనే అభిప్రాయం తెలంగాణవాదుల్లో ఉంటూ వచ్చింది. అదే సమయంలో కెసిఆర్ ఆంధ్రజ్యోతి పట్ల నిప్పులు చెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు ఆయనతో సామరస్యానికి వచ్చారు.

టిడిపిని రూపుమాపడానికి....

టిడిపిని రూపుమాపడానికి....

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రూపుమాపడానికి కంకణం కట్టుకున్న కెసిఆర్ ఆ పనిని సమర్థంగా పూర్తి చేసిన తర్వాత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన ఉన్న రామోజీ రావు, రాధాకృష్ణలతో కెసిఆర్ సయోధ్యకు వచ్చారు. తెలంగాణలో తాము ఎంత కంకణం కట్టుకున్నా నిలబెట్టలేమనే భావనకు చంద్రబాబు రావడంతో పరిస్థితి మారిపోయినట్లు భావిస్తున్నారు. దాంతో చంద్రబాబుతోనూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే పత్రికాధిపతులతోనూ సయోధ్యకు వచ్చి కెసిఆర్ తనకు వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది.

రేవంత్ రెడ్డి ఎంత అరిచి గీపెట్టినా...

రేవంత్ రెడ్డి ఎంత అరిచి గీపెట్టినా...

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంత అరిచి గీపెట్టినా తెలంగాణలో టిడిపి తిరిగి పుంజుకోలేని పరిస్థితే ఉంది. రేవంత్ రెడ్డికి మిగతా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ సహకరిస్తున్నట్లు లేరు. చంద్రబాబు నాయుడు గానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గానీ రేవంత్ రెడ్డికి సహకరించే అవకాశాలు లేకుండా పోయాయి. పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో టిడిపిని చంద్రబాబు వదిలేసినట్లే భావించాలి. ఇది కెసిఆర్‌కు పెద్ద ఊరట.

ఇక కాంగ్రెసు టార్గెట్...

ఇక కాంగ్రెసు టార్గెట్...

తెలంగాణలో టిడిపి నామమాత్రం కావడంతో, వైయస్సార్ కాంగ్రెసుకు స్థానం లేకపోవడంతో కెసిఆర్ దృష్టి ఇప్పుడు కాంగ్రెసుపై పడింది. కాంగ్రెసు నాయకులను లక్ష్యం చేసుకుని ఆయన వాగ్బాణాలు విసురుతున్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను మలచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే, అది సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. కెసిఆర్‌కు దూరమైన వర్గాలు భవిష్యత్తులో ఏ విధమైన వైఖరి తీసుకుంటాయనేది కూడా ఈ విషయంలో ప్రధానమైన అంశం కావచ్చు.

ఆత్మగౌరవం కోసం పోరాటం...

ఆత్మగౌరవం కోసం పోరాటం...

స్వయంపాలన కోసమే కాకుండా ఆత్మగౌరవం కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాగిన విషయం తెలియంది కాదు. ఈ రకంగా చూస్తే, చంద్రబాబు తనకు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా తగిన గౌరవం ఇవ్వడంతో కెసిఆర్ ఆత్మగౌరవం నిలబడినట్లే భావించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తన వెంట ఉంటూ, తనకు అన్ని వేళల్లో మద్దతు ఇచ్చిన వర్గాలకు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడం ద్వారానో మౌనంగా ఉండడం ద్వారానో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సముఖంగా లేకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన వైపు వచ్చిన వర్గాలను కెసిఆర్ చేరదీశారు. వారికి పదవులు, నజరానాలు ఇచ్చారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తటస్థ వర్గాన్ని చాలా వరకు ఆయన విస్మరించారు. ఈ విస్మరణ రేపు రేపు కెసిఆర్‌కు వ్యతిరేకంగా పనిచేయదనే గ్యారంటీ ఏమీ లేదు. కెసిఆర్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడాన్ని తెలంగాణవాదులంతా హర్షిస్తారు గానీ తమ ఆత్మగౌరవం మాట ఏమిటనే ప్రశ్న తెలంగాణవాదుల్లో క్రమంగా బలపడుతూ వస్తోంది.

కోదండరామ్, తదితరులు...

కోదండరామ్, తదితరులు...

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌నుగానీ చెరుకు సుధాకర్ వంటివారిని గానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తటస్థ వర్గాలు ఇప్పుడు మౌనంగా ఉన్నాయి. కెసిఆర్‌ను రాజకీయంగా వ్యతిరేకిస్తున్న కోదండరామ్‌తో గానీ ఇతరులతో గానీ కలిసి పనిచేయడానికి ఈ వర్గం సుముఖంగా లేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్న స్థితిలో ఈ తటస్థ వర్గం మౌనంగా ఉంటుందని భావించడానికి లేదు. అది సామాజికవర్గం రూపం తీసుకుని కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమ రూపం దాల్చినా ఆశ్చర్యం లేదు. అయితే, మరో పర్యాయానికి కెసిఆర్‌కు ఢోకా లేదనే మాట వినిపిస్తోంది. కానీ, పరిస్థితి క్షేత్ర స్థాయిలో అంత సజావుగా లేదనే విషయం తెలిసిపోతోంది. తెలంగాణ పునర్నిర్మాణం అనేది తప్పుదారి పట్టింది, లేదా విస్మరణకు గురైందనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. ఏమైనా కెసిఆర్ జాగ్రత్త పడాల్సిందే. తన వ్యతిరేకులను ఏదో రకంగా నోరు మెదపకుండా చేయడం ద్వారా కాకుండా మరో రకంగా ఆయన ఆలోచిస్తే మంచిదనే అభిప్రాయం ఉంది.

English summary
Telangana CM K Chandrasekhar Rao (KCR) may be happy with getting self respect from Andhra Pradesh CM Nara Chandrababu Naidu. But what about other Telanganites?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X