వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

170 అధికరణమే చిక్కు: అసెంబ్లీ స్థానాల పెంపునకు మూడు ప్రత్యామ్నాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోంశాఖ తీవ్రంగా ఆలోచిస్తున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోంశాఖ తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఇందుకోసం మూడు ప్రత్యామ్నాయాలతో ఒక ఫైల్ రూపొందిందని సమాచారం.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో స్పష్టంగా పేర్కొన్నది. అందువల్ల అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగంలోని 170వ అధికరణంతో వచ్చే చిక్కులను అధిగమించడంపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ మూడు రకాల ప్రత్యామ్నాయాలను కేంద్ర హోంశాఖకు పంపింది.

దీనిపై కేంద్ర హోంశాఖలో ఉన్న శాసన వ్యవహారాల విభాగం అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ వార్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Union government softens stand on Assembly seats hike in Telugu states

ఇదీ వాస్తవ పరిస్థితి

రాజ్యాంగంలోని 170వ అధికరణం ప్రకారం 2031లో జరిగే జన గణన తర్వాత మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. అయితే.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం సీట్ల సంఖ్యను పెంచాలని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందువల్ల ఈ రెండు రాష్ర్టాలకు మినహాయించాలని పేర్కొంటూ సవరణ చేయవచ్చునని న్యాయశాఖ ప్రతిపాదించిన తొలి ప్రత్యామ్నాయం. రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని మూడో సబ్‌క్లాజ్‌కు చిన్న సవరణ చేస్తే సమస్యలు అధిగమించవచ్చని, పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీతోనే ఈ సవరణ సాధ్యమని పేర్కొంది. ఇదే 170వ అధికరణంలో ప్రస్తుత మూడు సబ్ క్లాజులకు అదనంగా ఒక సబ్ క్లాజును పెట్టి సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని చేసిన సూచన మూడో ప్రత్యామ్నాయం. తద్వారా భవిష్యత్‌లో ఏ రాష్ట్రం నుంచి డిమాండ్ వచ్చినా రాజ్యాంగంలో ఎలాంటి చిక్కులకు ఆస్కారం ఉండదని కేంద్ర హోంశాఖ భావిస్తున్నది.

అధ్యయనం చేస్తున్న శాసన వ్యవహారాల శాఖ

న్యాయశాఖ చేసిన మూడు ప్రత్యామ్నాయాలపై హోం మంత్రిత్వశాఖలోని శాసన వ్యవహారాల విభాగం అధ్యయనం చేసి, ఏది మేలో హోం మంత్రికి వివరిస్తుంది. దాని ప్రకారం హోం మంత్రి నిర్ణయం తీసుకుని తదనుగుణంగా నోట్‌ను తయారుచేసి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ)కి అందజేస్తారు. అక్కడ ఆమోదం తర్వాత దానికనుగుణంగా బిల్లు తయారవుతుంది. 2019 సాధారణ ఎన్నికల నాటికి రెండు రాష్ర్టాల్లోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత దానికి అనుగుణంగా తదుపరి ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.

170వ అధికరణంతోనే చిక్కు

గత శీతాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంపునకు వీలుగా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించినా అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఇచ్చిన లిఖితపూర్వక అభిప్రాయం మేరకు వాయిదా పడింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సీట్ల సంఖ్యను పెంచాలన్న స్పష్టత ఉన్నా రాజ్యాంగంతో చిక్కులుండటంతో అంతిమంగా రాజ్యాంగంలో చెప్పిందే చెల్లుబాటవుతుందని, ఆ ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాతే సీట్ల సంఖ్య పెంపుగానీ, పునర్వ్యవస్థీకరణగాని సాధ్యమని అప్పటి అటార్నీ జనరల్ రోహత్గీ స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 170వ అధికరణానికి సవరణ చేస్తే తప్ప ఈ చిక్కు నుంచి బైటపడే అవకాశం లేదని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ఎంపీలు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో అనుగుణంగా అనే పదానికి బదులు అయినప్పటికీ అనే పదం చేర్చడంద్వారా 170వ అధికరణంతో వచ్చే చిక్కును అధిగమించవచ్చని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశారు. దీనిపైన కూడా లీగల్ అభిప్రాయాన్ని తీసుకున్న కేంద్రం శాశ్వతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో ఏ రాష్ట్రంలో ఇలాంటి చిక్కు ఎదురైనా అధిగమించేందుకు వీలుగా 170వ అధికరణానికి మార్పులు చేసే రాజ్యాంగ సవరణే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చింది. అందులో భాగంగానే ఆ రాజ్యాంగ సవరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనేదానిపై న్యాయశాఖలోని శాసన వ్యవహారాల విభాగం లోతుగా అధ్యయనం చేసి మూడు రకాలుగా చేయవచ్చునని హోంశాఖకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖే.

వార్షాకాలం సమావేశాల్లోనే బిల్లు!

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే దీనిపై సీసీపీఏ నిర్ణయం తీసుకుని ఆ తర్వాత బిల్లుకు తుదిరూపు ఇచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. రెండు రాష్ర్టాల నుంచీ ఏకాభిప్రాయం ఉన్నందువల్ల ఆ మేరకు ఇబ్బందులు తగ్గినట్లే. సీట్ల సంఖ్యను పెంచవద్దని రెండు రాష్ట్రాల బీజేపీ నాయకత్వం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినందువల్ల ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీతో చర్చించే అవకాశం ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రతి హామీనీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉన్నందువల్ల నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లు ఈ అంశంపై తరుచూ కేంద్ర హోంశాఖను సంప్రదిస్తూ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Of late, BJP leaders of the party’s units in both TS and AP have softened their resistance to the increase in the number of Assembly seats in both the states.It is believed that this shift in stand has got much to do with the intervention of Union minister M. Venkaiah Naidu who is now at the helm of the efforts to bring an amendment to the AP Reorganisaton Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X