తొలి తూటా వికారుద్దీన్‌కే: పోలీసులపై ఘాటు వ్యాఖ్య
హైదరాబాద్: జనగామ - ఆలేరు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొలి తుటా వికారుద్దీన్ పైనే దిగిందని తెలుస్తోంది. తొలుత పోలీసులతు ఘర్షణకు ఇతనే దిగాడు. వికారుద్దీన్ తలలో, గొంతులోకి తూటాలు దూసుకెళ్లాయి. ఒక్కో మృతుడి శరీరాల్లోకి 5 నుండి ఎనిమిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఇవి పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. ఐదింటిలో నాలుగు మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు.
మరో ఉగ్రవాది ఇజార్ ఖాన్ కుటుంబ సభ్యులు లక్నో ప్రాంతం నుండి రావాల్సి ఉంది. ఒక బుల్లెట్ వికారుద్దీన్ తలలో నుండి రెండో వైపుగా బయటకు వచ్చింది. మరో తూటా గొంతులోకి దిగింది. మరికొన్ని శరీరంలోకి దూసుకెళ్లాయి. మిగిలిన ఉగ్రవాదులకు కూడా తలకు, శరీర భాగాలకు తాకినట్లుగా తెలుస్తోంది. పరారయ్యే ప్రయత్నాల్లో భాగంగా ఘర్షణకు దిగిన ఉగ్రవాదుల పైన తమ సిబ్బంది ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.

వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌కు మూడు రోజుల ముందు సూర్యాపేట జానకీపురంలో ఇద్దరు సిమి ఉగ్రవాదులను పోలీసులు కాల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై వికారుద్దీన్ స్పందిస్తూ.. ఇద్దర్ని చంపగానే హీరోలు అయ్యారా అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అనంతరం పారిపోయే ప్రయత్నం చేశారని సమాచారం.
వికారుద్దీన్ కోర్టు విచారణకు తరలించే ప్రతిసారీ సిబ్బందిపై మాటల తూటాలు పేల్చేవాడట. వారిపై బూతు పురాణం ఉపయోగించేవాడు. దాంతో వికారుద్దీన్ అండ్ గ్యాంగ్‌కు గార్డు డ్యూటీ అంటేనే సిబ్బంది భయంతో వణికిపోయే వారట. మంగళవారం వరంగల్ జైలు నుంచి నాంపల్లి కోర్టుకుతీసుకు వచ్చే సమయంలోనూ వికార్ అండ్ గ్యాంగ్ జైలు నుంచి వాహనం బయలు దేరినప్పటి నుంచి భద్రతా సిబ్బందిపై మాటల తూటాలు పేల్చేవాడట.
కాగా, వికారుద్దీన్ గ్యాంగ్ సభ్యుల్ని కోర్టుకు తరలించే ప్రతిసారీ భద్రతా సిబ్బందికి జైలు వద్ద దాదాపు గంటకుపైగా అధికారులు క్లాస్ తీసుకుంటారు. వికార్ అండ్ గ్యాంగ్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పారిపోతారని తగు సూచనలు, సలహాలతోపాటు హెచ్చరికలు చేసేవారు. వరంగల్ జైల్లో వికార్‌తో పాటు అతని అనుచరులను ప్రత్యేకంగా వేర్వేరు గదుల్లో ఉంచి ఇంగ్లీష్‌తోపాటు మరో రెండు పత్రికల్ని అందజేసేవారు.
పత్రికల ద్వారా నల్లగొండ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారన్న విషయం వికారుద్దీన్ తెలుసుకున్నాడు. విచారణకు హాజరయ్యేందుకు మంగళవారం ఉదయం 8.30 నిమిషాల ప్రాంతంలో వాహనం ఎక్కినప్పటి నుంచి పోలీసులను దూషించడం ప్రారంభించాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దర్ని చంపగానే హీరోలయ్యారా అని ఘాటుగా మాట్లాడాడని సమాచారం.












Click it and Unblock the Notifications