ఎపి రాజధాని: బాబుతో జగడానికి జగన్ దూరం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ చేపట్టినా సహకరించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి జగన్ తన పార్టీ సహచరులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు ఆయన సూచనలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అనవసర రాద్దాంతానికి దిగవద్దని ఆయన కోరారని తెలిసింది.
సింగపూర్ లాంటి రాజధానిని చంద్రబాబు కడతారని చాలామందితో పాటు తాను సంతోషించానని జగన్ వ్యాఖ్యాంచారు కూడా. రాజధాని అంటే కేవలం అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం కట్టడం మాత్రమే కాదనేది జగన్ అభిప్రాయంగా వుంది. రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్మించినా తాను అభ్యంతరం పెట్టనని, కానీ రాష్ట్రానికి మధ్యలో ఉండేలా చూసుకోవాలని అన్నారు.

రాజధాని కోసం 25వేల నుండి 30వేల ఎకరాల భూమి కావాలని, అంత భూమి ఎక్కడుందో తనకు మాత్రం తెలియదంటున్న జగన్‌మోహన్‌రెడ్డి తన సహచరులకు ప్రభుత్వానికి సహకరించే విషయమై నిర్మాణాత్మకంగా వ్యవ హరించాలని సూచించారు. రాజధాని ఎక్కడ కట్టినా ఇరవై అయిదు నుండి ముప్పై వేల ఎకరాలలో కట్టాలనేది జగన్ అభిప్రాయంగా వుంది. అలాంటప్పుడు నిజంగా సింగపూర్ లాంటి నగరం సాధ్యమవుతుందని తాను ఆశిస్తున్నానని పార్టీ శ్రేణులతో చెబుతూ వస్తున్నారు.
అయితే ఆ కట్టబోయే రాజధానిలో పేదవాడిని, ప్రభుత్వ ఉద్యోగిని కూడా గుర్తుకు పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ అభిప్రాయం నిర్దిష్టంగా వున్నట్టు కనిపించినా సమీప భవిష్యత్తులో ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో విభేదించక తప్పదనే వారు కూడా లేకపోలేదు.
అసలు కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియలో చంద్రబాబునాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు వైఎస్సార్‌సిపి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనే విషయమై స్పష్టత వచ్చాక పార్టీ వైఖరిని చెప్పాలని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే తమకు తెలియకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే రాజధానిపై విభేదించక తప్పదని అంటున్నారు.












Click it and Unblock the Notifications