ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు షాక్: తిరగబడుతున్న కోటలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:వైఎస్ఆర్ సిపికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వైసిపి నుండి టిడిపి వైపుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసలు వెళ్తున్నారు. వైసిపిలో కీలకంగా ఉన్న నాయకులే ఆ పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నారు.మరో వైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో కూడ వైసిపి ఓటమిని చవిచూసింది. ఈ పరిణామాలు జగన్ నాయకత్వ తీరుపై సందేహలను కల్గిస్తున్నాయి.

2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయాలను నమోదు చేసింది. టిడిపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడ దక్కని పరిస్థితులు కూడ నెలకొన్నాయి.అయితే ఆ పరిస్థితి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారాన్ని కైవసం చేసుకొంది.

ఈ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో పాటు సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబునాయుడు అనుభవాలు తమకు పనికివస్తాయని ఓటర్లు టిడిపికి బిజెపి కూటమికి ఓటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి నుండి విజయం సాధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరువాత చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల్లో వైసిపిని వీడి టిడిపిలో చేరారు.వైసిపిని వీడిన నాయకులంతా జగన్ తీరును తప్పుబట్టేవారు.ఆయన అనుసరించే వ్యూహలు పార్టీని నట్టేట ముంచుతున్నాయనే విమర్శలు గుప్పించారు.

వైసిపి చీఫ్ జగన్ తీరును పట్ల అసంతృప్తిగా ఉన్న నాయకులు అధికార టిడిపి బాట పట్టారు. అయితే ఈ పరిణామాలన్నింటిని తనకు అనుకూలంగా టిడిపి మలుచుకొంటుంది.

జగన్ అనుభవరాహిత్యం

జగన్ అనుభవరాహిత్యం

వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని రాజకీ య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసిపిని వీడి టిడిపిలో చేరిన నాయకులు కూడ జగన్ అనుభవ రాహిత్యం అనే అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు ఉన్న చంద్రబాబునాయుడు అనేక సంఘటనలను ప్రత్యక్షంగా చూశారు. టిడిపి అనేక సంక్షోభాల నుండి బయటపడేలా చంద్రబాబు వ్యూహరచన చేశారు. పార్టీ సమావేశాల్లో సంక్షోభాల తర్వాత పార్టీ మరింత బలోపేతమైందని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు.అయితే వైసిపి అధినేత జగన్ రాజకీయాల్లో అనుభవం తక్కువ. అయితే ఆయన దుందుడుకు విధానాలు కూడ వైసిపికి నష్టం కల్గిస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.పార్టీని సరైన దిశలో నడపడంలో జగన్ నడపలేకపోతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ఒంటెత్తు పోకడలు

జగన్ ఒంటెత్తు పోకడలు

పార్టీ సమావేశాల్లో ఇతర నాయకుల సలహలను, సూచలను వైసిపి అధినేత జగన్ పట్టించుకొనే వారు కారని ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.తాను అనుకొన్నదే జగన్ చేస్తారని, ఈ పద్దతులను అనుసరించడం వల్ల పార్టీకి నష్టమనే అభిప్రాయాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోలేదని పార్టీని వీడి నాయకులు బహిరంగంగానే చెప్పారు.పార్టీ సీనియర్ల సూచనలను కూడ కనీసం జగన్ పట్టించుకొనేవారు కాదని వారు గుర్తు చేశారు.పార్టీ అవసరాల రీత్యా ఏది సరైన నిర్ణయమో దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులను జగన్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ ఆర్ కు జగన్ కు వ్యత్యాసం

వైఎస్ ఆర్ కు జగన్ కు వ్యత్యాసం

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టక ముందు ఓ రకంగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోరకంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. చిన్నతనంలోనే పిసిసి అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఆయన చాలాకాలంపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీరులో కూడ అనేక మార్పులు వచ్చాయి. ఫ్యాక్షన్ నాయకుల మద్య రాజీ కుదిర్చారు. కర్నూల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి ల మద్య రాజీ ఒప్పందానికి వైఎస్ కృషి చేశారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి.కాని, జగన్ తీరు ఆ రకంగా ఉండదని వైసిపి నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.వైసిపిలో ఉంటూ టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి మరణిస్తే ఆయన అంత్యక్రియలకు జగన్ హజరుకాకపోవడం పట్ల కూడ పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

.వైఎస్ఆర్ సిపి కంచుకోటలకు బీటలు

.వైఎస్ఆర్ సిపి కంచుకోటలకు బీటలు

వైఎస్ఆర్ సిపి కంచుకోటలకు బీటలు వారుతున్నాయి.2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి ఏడు అసెంబ్లీ స్థానాల్లో, ఒక్క ఎంపి స్థానాన్ని కైవసం చేసుకొంది.టిడిపి నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు జరిగి సుమారు మూడేళ్ళు కావస్తోంది.ఈ తరుణంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు లో వైసిపిపై టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. కడప జిల్లా వైఎస్ఆర్ సిపికి కంచుకోట.అయితే ఈ జల్లాలో 34 ఏళ్ళ తర్వాత వైఎస్ కుటుంబాన్ని టిడిపి తొలిసారి ఓడించింది. వైఎస్ఆర్ సిపికి గట్టి పట్టున్న కడప జిల్లాలో కూడ 33 ఓట్లతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వివేకానందరెడ్డి ఓటమి పాలు కావడం ఆ పార్టీకి ఊహించని షాక్,కర్నూల్ జిల్లాల్లో కూడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి శిల్ప చక్రపాణిరెడ్డి విజయం సాధించారు.

చంద్రబాబుకు కలిసి వచ్చిన రాజకీయ అనుభవం

చంద్రబాబుకు కలిసి వచ్చిన రాజకీయ అనుభవం

సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు వైసిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కలిసివస్తోన్న అంశమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో అనంతపురం జిల్లాలో మినహ ఇతర జిల్లాల్లో టిడిపికి అనుకొంత పట్టులేదు. ఈ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని టిడిపి అధినేత వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకొన్నారు.కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీమంత్రి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మద్య ఉన్న గొడవలను రాజీ చేసి ఆదినారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకొన్నారు బాబు. చెంగల్రాయుడును కూడ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరేలా ప్రోత్సహించారు. వైసిపి నుండి ఆఫర్ వచ్చినా చెంగల్రాయుడు టిడిపిని ఎంచుకొన్నారు.భూమానాగిరెడ్డి ఆయన కూతురు, ఎష్ వి మోహన్ రెడ్డి టిడిపిలో చేరేలా చక్రం తిప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నాయకులను తమ పార్టీలోకి చేరేలా బాబు చేసిన వ్యూహరచన ఫలించింది.

జగన్ ను ఇరుకున పెట్టేందుకు బాబు వ్యూహం

జగన్ ను ఇరుకున పెట్టేందుకు బాబు వ్యూహం

అవకాశం దొరికినప్పుడల్లా వైసిపి అధినేత జగన్ ను రాజకీయంగా ఇరుకునపెట్టే వ్యూహాలను అధికార టిడిపి రచిస్తోంది. ఈ మేరకు వచ్చిన అవకాశాలను ఆ పార్టీ ఉపయోగించుకోవాలని భావిస్తోంది.స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను టిడిపి ఈ మేరకు ఉపయోగించుకొంది. కడప జిల్లాలో వైసిపి అధినేత జగన్ బాబాయి వివేకానంద రెడ్డి ఓటమి పాలవ్వడం వైసిపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉంది. కడప జిల్లాలో వైసిపిపై టిడిపి విజయం అధికార పార్టీకి రెట్టింపు ఉత్సాహన్ని ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసిపి, టిడిపి ఎత్తుకు పై ఎత్తులు

వైసిపి, టిడిపి ఎత్తుకు పై ఎత్తులు

ఎన్నికల ముందు ప్రత్యేక హోదాను బిజెపి, టిడిపి కూటమి డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని బిజెపి కూడ ప్రకటించింది.అయితే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి.అయితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే అంశంపై వైసిపి టిడిపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది. మరో వైపు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ఆంద్రప్రదేశ్ కు ప్రకటించింది.అయితే ఈ ప్యాకేజీ విషయమై కూడ టిడిపి బిజెపి కూటమిపై వైసిపి మాటల యుద్దాన్ని చేసింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించడం అధికార బిజెపి టిడిపి కూటమికి కలిసివచ్చింది. ఈ పరిణామం వైసిపికి కాస్త ఇబ్బందికర పరిణామంగానే ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టిడిపిలో ఉత్సాహం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టిడిపిలో ఉత్సాహం

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార టిడిపిలో ఉత్సహాన్ని నింపాయి. వైసిపి లో ఈ ఫలితాలు నిరుత్సాహన్ని కల్గిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో టిడిపిని దెబ్బతీసేందుకుగాను ఆనం విజయ్ కుమార్ రెడ్డిని వైసిపి ఈ ఎన్నికల్లో బరిలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. 34 ఏళ్ళ తర్వాత కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఓటమి కలగడం కూడ ఆ పార్టీకి తీవ్రమైన నిరుత్సాహన్ని కల్గిస్తోంది.వైఎస్ కుటుంబానికి ఓటమి అనేది లేదని చరిత్ర చెబుతోంది. అయితే అలాంటి జిల్లాల్లో టిడిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ఇబ్బందిని కల్గిస్తోంది. విశాఖలో ఎంపిగా పోటీచేసిన విజయమ్మ ఓటమి పాలు కావడం 2014 లో వైసిపికి ఇబ్బంది కల్గించింది.ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమిపాలు కావడం కూడ వైసిపికి రాజకీయంగా ఇబ్బందికల్గించే పరిణామమని అభిప్రాయపడుతున్నారు.

పకడ్బందీ ప్లాన్ తో వైసిపి చిత్తు చేసిన టిడిపి

పకడ్బందీ ప్లాన్ తో వైసిపి చిత్తు చేసిన టిడిపి

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం టిడిపి పకడ్బందీ ప్లాన్ వేసింది. ఆ పార్టీ అధికారంలో ఉండడం కూడ టిడిపికి కలిసి వచ్చింది. టిడిపికి ప్రత్యర్థులుగా ఉన్న నాయకులను కూడ ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కలిసి అభ్యర్థించారు. బీటెక్ రవి గెలుపును తన భుజాన వేసుకొన్నాడు రాజ్యసభ సభ్యుడు బిటెక్ రవి.ని గెలిపించాడు.

నాడు ఓటమి నేడు గెలుపు

నాడు ఓటమి నేడు గెలుపు

వైఎస్ఆర్ సిపి పార్టీని ఏర్పాటు చేసి కడప పార్లమెంట్ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ పోటీచేశారు.2012 ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. ఆనాడు కడప పార్లమెంట్ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా ఎంవి మైసూరారెడ్డి, పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి బీటెక్ రవి పోటీచేశారు.ఆనాడు కడప పార్లమెంట్ స్థానం నుండి రికార్డు మెజారిటీతో వైఎస్ జగన్ విజయం సాధించారు. పులివెందుల స్థానం నుండి వైఎస్ విజయమ్మ విజయం సాధించారు.బీటెక్ రవి ఘోరంగా ఓటమిపాలయ్యారు.అయితే అదే కుటుంబానికి చెందిన వైఎస్ వివేకానందరెడ్డిపై బిటెక్ రవి విజయం సాధించారు.

ప్రలోభాలతో టిడిపి విజయం సాధించింది

ప్రలోభాలతో టిడిపి విజయం సాధించింది

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించడం వెనుక అధికార పార్టీ ప్రలోభాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అక్రమంగా విజయం సాధించిందని ఆయన చెప్పారు. వైసిపి కార్యకర్తలు ఎవరూ కూడ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.ధైర్యముంటే వైసిపి నుండి టిడిపిలో చేరిన వారితో రాజీనామాలు చేయించి మళ్ళీ గెలిపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి క్యాంపులు పెట్టి పోలీసుల సహయంతో నాయకులను ఇళ్ళ నుండి తీసుకెళ్ళారని వైసిపికి చెందిన మరో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. చెక్కులు ఇచ్చి, మత పెద్దల వద్ద ప్రమాణాలు చేయించుకొని గెలిచారన్నారు. ఈ గెలుపు గెలుపే కాదన్నారాయన.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ys jagan failure strategies in politics.three districts local bodies results impact on ysrcp.
Please Wait while comments are loading...