టిపై జగన్ రోజుకో మాట, వారితో లాభం లేదా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యం ముసుగులో విభజనకు సహకరిస్తున్నారా? రోజుకో మాట మాట్లాడుతున్నారా? అంటే తెలుగుదేశం పార్టీ అవుననే ఆరోపిస్తోంది. ఇప్పటికే సమైక్యానికి కట్టుబడి ఉన్నామని బాహాటంగా ప్రకటించిన వారిని జగన్ కలవడం వల్ల వచ్చే లాభమేమిటని టిడిపి ప్రశ్నిస్తోంది. మొదట ఓ ఇంటి పెద్దలా విభజించమని చెప్పిన జగన్, తర్వాత ఆర్టికల్ 3ని సూచించారని, ఆ తర్వాత సమన్యాయం అన్నారని, ఇప్పుడు సమైక్యవాదం ఎత్తుకున్నారని విమర్శిస్తున్నారు.
విభజన విషయంలో జగన్ సమైక్య పిల్లి మొగ్గలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమైక్యం కోసమంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినా ఇప్పటి వరకు ఆమోదించుకోలేదని చెబుతున్నారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ జనంలోకి వెళ్తారని, సమైక్య వాదానికి ఐకాన్‌గా మారతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ, జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ అనూహ్యంగా చల్లబడ్డారంటున్నారు.

నేరుగా ప్రజల్లోకి వెళ్లి సమైక్య వాదాన్ని గట్టిగా వినిపించాల్సిన జగన్ టైం వృథా చేస్తూ, ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వివిధ రాజకీయ పార్టీల అధినేతలను కలవటాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేక పోతున్నారట. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రాకుండా ప్రజా ఉద్యమం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నా కేవలం మీడియాలో ప్రచారం కోసం జగన్ ఆరాటపడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
పైగా ఆచరణ సాధ్యం కాని, ఇప్పటికిప్పుడు విభజనను అడ్డుకునే అవకాశంలేని డిమాండ్లను జగన్ తెరపైకి తెస్తుండటం కూడా వారిని గందరగోళపరుస్తోందంటున్నారు. విభజన అంశంపై గతంలో ఆర్టికల్ 3ని జగనే ముందుకు తెచ్చి ఇప్పుడు దానిపై జ్యూడిషియల్ రివ్యూ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రపతి ఏదేని అంశంపై తుది నిర్ణయం తీసుకోవటానికి ముందు మాత్రమే జ్యుడీషియల్ రివ్యూ కోరే వీలుందని చెబుతున్నారు.

బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే అది చట్టంగా మారుతుందని, అప్పుడే జ్యుడీషియల్ రివ్యూకు కూడా అవకాశం ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ముందు జ్యుడీషియల్ రివ్యూకు పంపించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని జగన్ లిఖితపూర్వకంగా కోరడమేమిటంటున్నారు. సమైక్యవాదం పేరిట దేశంలోని వివిధ పార్టీల నేతలను కలుస్తున్నా రాష్ట్ర విభజన జరగవద్దని జగన్ ఎక్కడా కోరుకోవటం లేదని ఆరోపిస్తున్నారు.
పైగా రాష్ట్రపతిని జ్యుడీషియల్ రివ్యూ కోరటం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లుకు పరోక్షంగా అనుకూలత వ్యక్తం చేయటంతోపాటు, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆ బిల్లును ఆమోదించాలని జగన్ కోరినట్టే అయిందంటున్నారు. జగన్ పేరుకు సమైక్యవాదం వినిపిస్తున్నా అంతర్గతంగా రాష్ట్ర విభజన అజెండాతో వెళ్తున్నట్లు రాష్ట్రపతికి ఇచ్చిన వినతి పత్రం ద్వారా స్పష్టమైందని టిడిపి నేత సిఎం రమేష్ ఆదివారం ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications