రేపటికల్లా ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఏపీలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డుల ప్రదర్శన నేపథ్యంలో అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటికల్లా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సరఫరా పెరగాలని సీఎం అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోండని అధికారులకు సూచనలు చేశారు. అలాగే పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఆప్షన్ ఎందుకు ఇవ్వడం లేదని హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులను నిలదీశారు. ఇంధన విషయంలో ప్రజలు, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తనకు నివేదికలు వద్దని, రేపటిలోగా ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించవద్దని తెలిపారు.
అలాగే ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యను పరిష్కరించేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు కూడా సప్లయ్ నిలిపివేయడంతో సమస్య తీవ్రమైందని కలెక్టర్లు ఈ మేరకు సీఎంకు వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బ్లాక్ లో అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెల్లారేసరికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని సీఎం చంద్రబాబు ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలకుండా క్రెడిట్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు పార్వతీపురం, శ్రీకాకుళం, కోనసీమ జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా టెలీ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. మూడు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంకుల్లో నిల్వలు, డిమాండ్ పరిస్థితిపై సమీక్షలో సమగ్రంగా చర్చలు జరిపారు. అలాగే బంకుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications