బంగాళాఖాతంపై ద్రోణి- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మే నాటికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. వేడి గాలుల ప్రభావానికి శరీరంలో నీటి శాతం కూడా ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత ఊపిరిసలపనివ్వట్లేదు.

ఈ పరిస్థితుల మధ్య తీపికబురు అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈదురుగాలులు వీయవచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షం, అక్కడక్కడ చిరు జల్లులు పడొచ్చని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు సహా పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. అలాగే దక్షిణ కోస్తా తీరంలోని నెల్లూరు సహా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాలల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, నేడు అధిక ఉష్ణోగ్రతతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. మొత్తం 20 జిల్లాల పరిధిలో 227మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications