Google Data center:విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన ఎప్పుడంటే..?
Google Data Center :ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ (Google) విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక AI డేటా సెంటర్‌కు ఏప్రిల్ 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ ఐటీ రంగంలోనే ఒక మైలురాయిగా నిలవనుంది.
విశాఖనే ఎందుకు? ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటి?
ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం ఆసియా ఖండానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గేట్‌వేగా మారుతుంది.తర్లవాడ, అడవివరం, రాంబిల్లీ ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించే ఈ సెంటర్ 1 గిగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.విశాఖ తీర ప్రాంతం కావడంతో అంతర్జాతీయ సబ్-మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఇది అనువైనది. దీనివల్ల పలు దేశాలతో ఏపీకి నేరుగా డిజిటల్ లింక్ ఏర్పడుతుంది.ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్‌తో పాటు అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఉద్యోగాల జాతర - ఆర్థిక పురోగతి
ఈ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదు. ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్దపీట వేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి ఆధునిక రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.సర్వర్ల తయారీ, కూలింగ్ టెక్నాలజీస్, పవర్ సిస్టమ్స్ వంటి రంగాల్లో కూడా కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.ఈ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్తును పర్యావరణహితమైన 'గ్రీన్ ఎనర్జీ' ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ఇంత భారీ పెట్టుబడి రావడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు విశాఖకు మరింత గ్లోబల్ అప్పీల్‌ను ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డిజిటల్ హబ్‌లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
"వికసిత్ భారత్ 2047" లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కీలక భూమిక పోషించనుంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల సరసన విశాఖపట్నం నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని ఈ పెట్టుబడులు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications