తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో ఇకపై.. !!
వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దీనికోసం సుమారు రెండు కోట్ల రూపాయలను వ్యయం చేసింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు వేశారు టీటీడీ అధికారులు.
అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లను అందుబాటులోకి తెచ్చారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు.

తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు మంచినీటిని అందిస్తున్నారు. దీనికోసం ఒక బ్యాచ్ లో 15 మంది వంతున, మొత్తం మూడు బ్యాచ్ ల్లో రోజుకు 45 మంది శ్రీవారి సేవకులు భక్తులను నియమించారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూలైన్, నారాయణ గిరి షెడ్లు సహా తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
వేసవి రద్దీకి అనుగుణంగా భక్తులకు స్వామివారి లడ్డూలను విరివిగా అందుబాటులో ఉంచారు టీటీడీ అధికారులు. సాధారణ రోజుల్లో 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచగా, పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ పెట్టారు. తిరుమలలో పరిమితంగా వసతి గదులు ఉన్న విషయం తెలిసిందే. దీనివల్ల 60,000 మంది భక్తులకు మించి వసతి కేటాయించడానికి వీలుపడదు.
గదులు పొందలేని భక్తులు తిరుమలలోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (పద్మనాభ నిలయం), పీఏసీ-5 లలో ఉన్న దాదాపు 9,000 లాకర్లను వినియోగించుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండే భక్తులకు వసతి సౌకర్యము కల్పించడానికి టీటీడీ అధికారులు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఒంటరిగా వచ్చే భక్తులకు వసతి గదులు కేటాయించట్లేదని తేల్చి చెప్పారు.
తిరుమలలో భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పణ కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో ప్రధాన కల్యాణకట్టతో పాటూ పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్సీ, హెచ్‌వీసీ, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీవేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో 11 మినీ కల్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళలు.












Click it and Unblock the Notifications