పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ? మోడీ ప్రకటనతో కేంద్రం సన్నాహాలు..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదని తేలిపోయింది. దీంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు (Fuel price hike) సిద్ధమవుతోంది. దీనికి చెబుతున్న కారణం మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్దం. ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరాలు తగ్గడం, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో మన ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయట. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు కేంద్రం చెబుతోంది.
పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సుదీర్ఘ ఘర్షణ కొనసాగుతుందనే ఆందోళనల నేపథ్యంలో, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇంటి నుంచే పని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘర్షణ భారతదేశంలో ఎంతోకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు దారితీయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన నేపథ్యంలో ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ముడి చమురు పరిస్దితి, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేసే ప్రభుత్వ విధానం ఆధారంగా ధరలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇప్పటికే చమురు మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురు, గ్యాస్, ఎల్‌పీజీలను అధిక ధరకు కొనుగోలు చేసి, వినియోగదారులను కాపాడేందుకు తక్కువ ధరకు అమ్ముతున్నాయని, దీనివల్ల రూ. 1,000 కోట్ల వరకు నష్టాలు పేరుకుపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వసూళ్లలో లోటు రూ.2 లక్షల కోట్లకు పెరగవచ్చని, నష్టాలు సుమారు రూ.1 లక్ష కోట్లు ఉండవచ్చని ఆయన వెల్లడించారు. దీంతో చమురు ధరలు పెంచక తప్పదని తేల్చేశారు. భారత్ దిగుమతులతో పాటు, హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం వల్ల, సుదీర్ఘ యుద్దం ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని పెంచుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మన మొత్తం చమురు నిల్వ సామర్థ్యం సుమారు 74 రోజులకు సరిపోతుందని, అందులో 60 రోజుల చమురు సరఫరా ఉందని కేంద్రం చెబుతోంది.












Click it and Unblock the Notifications