ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్ అందింది. దేశంలో మొట్టమొదటి బ్యారియర్ ఫ్రీ టోల్ గేట్ అందుబాటులోకి వచ్చింది. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) బారియర్ లెస్ టోలింగ్ వ్యవస్థ ఇది. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ఉండే ఎటువంటి అడ్డంకులూ ఇక్కడ ఉండవు. దీని గుండా వాహనదారులు నేరుగా దూసుకెళ్లొచ్చు. అయినప్పటికీ- ఫాస్టాగ్ వాలెట్ నుంచి సంబంధిత మొత్తం డిడక్ట్ అవుతుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
గుజరాత్‌లోని NH-48పై నేడు దీన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సూరత్-భరూచ్ సెక్షన్‌లోని చోరయాసి టోల్ ప్లాజా వద్ద అందుబాటులోకి వచ్చింది. దేశంలో తొలి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో బారియర్-లెస్ టోల్ ప్లాజా ఇదే. వాహనాలు ఆగకుండానే టోల్ చెల్లింపులు జరిపేలా రూపొందించిన ఈ అత్యాధునిక వ్యవస్థలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వంటి టెక్నాలజీని వినియోగించారు. ఏఎన్పీఆర్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఫాస్టాగ్ నుంచి అమౌంట్ కట్ అవుతుంది.

చోరయాసి టోల్ ప్లాజా వద్ద అమలులోకి వచ్చిన ఈ ఎంఎల్ఎఫ్ఎఫ్ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్. ఇది వాహనాలను తక్షణమే గుర్తించి, టోల్ ఛార్జీలను రియల్‌టైమ్‌లో వసూలు చేస్తుంది. సంప్రదాయ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నివారించడానికి, అక్కడ ఏర్పడే జాప్యాన్ని అధిగమించడానికి ఈ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ. అధునాతన సెన్సార్లు, కెమెరాల సహాయంతో టోల్ ప్రక్రియ సజావుగా సాగుతుందిక్కడ.
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID), ఏఎన్పీఆర్ టెక్నాలజీ సహాయంతో ఇందులోని సెన్సార్లు ఫాస్టాగ్ స్టిక్కర్‌లను స్కాన్ చేస్తాయి. సంబంధిత ఖాతా నుండి టోల్ రుసుమును ఆటోమేటిక్‌గా తీసుకుంటాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు హైరిజల్యూషన్ కెమెరాలు నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేసి, డిజిటల్ ఇన్‌వాయిస్‌ను జారీ చేస్తాయి. ఈ మొత్తాన్ని జరిమానాతో సహా తర్వాత వసూలు చేస్తారు. ఫాస్టాగ్ లేనందుకు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది సదరు వాహనదారులకు.
సెన్సార్లు, కెమెరాలు సేకరించిన డేటా మొత్తం కూడా సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్‌కు అందుతుంది. ఈ వ్యవస్థ వాహనాన్ని గుర్తించి, టోల్ మొత్తాన్ని లెక్కిస్తుంది. క్షణాల్లో ఫాస్టాగ్ వాలెంట్ నుంచి మొత్తాన్ని తీసుకుంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది. టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడం, తద్వారా ఇంధనాన్ని ఆదా చేయడం, వాహన కాలుష్యాన్ని నివారించడానికి ఈ ఆధునిక వ్యవస్థ ఉపయోగపడుతుంది.
📢🛣️ Delighted to announce that the country’s first Multi-Lane Free Flow (MLFF) barrier-less tolling system has been launched today at the Chorayasi Toll Plaza on the Surat–Bharuch section of NH-48 in Gujarat. This state-of-the-art solution enables seamless toll collection…
— Nitin Gadkari (@nitin_gadkari) May 1, 2026
ఈజ్ ఆఫ్ లివింగ్ మరింత మెరుగుపడుతుందని, వస్తువులు, లాజిస్టిక్స్ రవాణాలో వేగం, సామర్థ్యం పెరుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. ఈ డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లను కూడా బ్యారియర్ ఫ్రీ గా మార్చాలని భావిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని హైవేలకు ఈ విధానాన్ని విస్తరించాలని యోచిస్తోన్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications