అన్నా ఈ మూవీ నువ్వే ఓకే చేశావా ?? అలా వచ్చి ఇలా పోయి మళ్లీ ఓటీటీకి !!
యువ హీరో నాగశౌర్య కెరీర్‌లో ఒకప్పుడు వరుస హిట్లతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 'ఊహలు గుసగుసలాడే', 'చలో', 'అశ్వథ్థామ' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఇటీవల మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ముఖ్యంగా 2023లో వచ్చిన 'రంగబలి' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో.. ఆయన తదుపరి సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్'పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైంది. అయితే సరైన ప్రమోషన్లు లేకపోవడం, బలమైన పోటీ సినిమాలు ఉండటం, కథనం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోవడంతో మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. విడుదలైన కొద్ది రోజులకే చాలా థియేటర్ల నుంచి సినిమా తొలగించబడింది. దీంతో నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందనే చర్చ సినీ వర్గాల్లో వినిపించింది.

అయితే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే 'బ్యాడ్ బాయ్ కార్తీక్' శుక్రవారం (మే 15) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ మూవీ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ చిత్రానికి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించగా, విధి యాదవ్ హీరోయిన్‌గా నటించింది. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, అక్కాచెల్లెళ్ల బంధం, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 'ఈశ్వర్' ఫేమ్ శ్రీదేవి నాగశౌర్యకు అక్క పాత్రలో కనిపించగా, ఆమె కోసం హీరో చేసే పోరాటం కథకు ప్రధాన బలం.
అలాగే సముద్రఖని, సాయికుమార్, నరేష్, వెన్నెల కిశోర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు బలాన్ని చేకూర్చారు. ముఖ్యంగా నాగశౌర్య యాక్షన్ సీన్లు, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌గా మారిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల అభిరుచి భిన్నంగా ఉండటంతో, థియేటర్లలో ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆదరణ పొందిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications