దీదీ గుడ్ బై.. భవానీపూర్ లో ఘోర ఓటమి..
పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో మరో సంచలనం నమోదైంది. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఇప్పటికే బెంగాల్ లో బీజేపీ 200 లకు పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకూ కేవలం 72 స్థానాల్లోనే విజయం సాధించింది. అయితే 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ లో సువేందు అధికారి.. మమతను ఓడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె భవానీపూర్ లో గెలిచి సీఎం పదవిని కాపాడుకున్నారు. ఈసారి ఇక్కడ కూడా సువేందు అధికారి మమతను ఓడించడం విశేషం.
ఇక బెంగాల్ ఫలితాలపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాతీర్పు కాదని దోపిడీ చేశారని మండిపడ్డారు. ఇది ఓటమి కాదు.. దోపిడీ.. దోపిడీ.. దోపిడీ.. అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలను మోహరించి బీజేపీ ఈ విజయం సాధించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఓటమితో తాము కుంగిపోమని.. తృణమూల్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని.. కచ్చితంగా తాము మళ్లీ పుంజుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అంతేకాక ఈ ఫలితాలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

15 ఏళ్ల పాటు బెంగాల్ లో చక్రం తిప్పిన టీఎంసీ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కారణంగానే బెంగాల్ ప్రజలు ఈ తీర్పు ఇచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బెంగాల్ లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరగ్గా బీజేపీ 203 స్థానాలను కైవసం చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 79 స్థానాలకే పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది.












Click it and Unblock the Notifications