కాబోయే సీఎం 'పీఏ'ను నడి రోడ్డుపై కాల్చి చంపేశారు!
పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం మరోసారి నెత్తురోడింది. ఎన్నికల ఫలితాల వేడి చల్లారకముందే, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేత, కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (PA) చంద్ర దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి మధ్యమ్‌గ్రామ్ సమీపంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
రాత్రి 10:30 నుండి 11 గంటల మధ్య సమయం.. చంద్ర తన కారులో వెళ్తుండగా, ఆసుపత్రికి కేవలం 200 మీటర్ల దూరంలో మృత్యువు అతడిని పలకరించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చంద్ర ప్రయాణిస్తున్న కారు నెమ్మదించగానే, బైక్‌పై వచ్చిన ఆగంతకుడు మెరుపు వేగంతో కారు ఎడమ వైపునకు చేరాడు. ఏ మాత్రం తడుముకోకుండా, చాలా దగ్గరి నుండి (Point Blank Range) చంద్రపైకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అత్యంత వృత్తిపరమైన హంతకుడిలా (Professional Hitman) తూటాల వర్షం కురిపించి, రెప్పపాటు కాలంలో అక్కడి నుండి మాయమయ్యాడు. తీవ్రంగా గాయపడిన చంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

పక్కా 'రెక్కీ'.. సునిశిత ప్లాన్!
ఇది కేవలం ఆకస్మికంగా జరిగిన దాడి కాదు, సెకండ్ల వ్యవధిలో ముగించిన పక్కా ప్లాన్ అని పోలీసులు నిర్ధారించారు. పశ్చిమ బెంగాల్ డీజీపీ సిద్ధ్ నాథ్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. "హంతకులు రెండు మూడు రోజుల పాటు చంద్ర కదలికలపై నిఘా ఉంచి, రెక్కీ నిర్వహించారు. కచ్చితమైన సమయం చూసి దెబ్బకొట్టారు" అని డీజీపీ వెల్లడించారు. ఘటనా స్థలంలో సజీవ రౌండ్లు, ఖాళీ తూటాలు లభ్యమయ్యాయి. ఫోరెన్సిక్ బృందం కూడా ఆధారాలను సేకరించింది.
#WATCH | North 24 Parganas | Forensic team investigates the vehicle in which BJP Leader Suvendu Adhikari's PA Chandra was shot dead near Madhyamgram pic.twitter.com/JMYBPRjP1d
— ANI (@ANI) May 6, 2026
రాజకీయ కుట్ర కోణం: 'ఓటమి ప్రతీకారం' అంటూ బీజేపీ ఫైర్!
ఈ హత్య వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) హస్తం ఉందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ, "ఇది భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమికి పర్యవసానం. రాజకీయంగా ఎదుర్కోలేక, సువేందు అధికారికి కుడిభుజంలా ఉండే చంద్రను లక్ష్యంగా చేసుకున్నారు" అని ఆరోపించారు.
బీజేపీ నేత సువేందు అధికారి ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "చంద్ర మా కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యేలందరికీ సోదరుడు. 15 ఏళ్ల 'జంగల్ రాజ్' పరాకాష్ట ఇది. ఈ గూండాలను బీజేపీ ప్రక్షాళన చేస్తుంది" అని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మృతుడి కుటుంబానికి భరోసా కల్పించారు.
ప్రతీకారం వద్దు.. మే 9 తర్వాత అంతా సెట్! - స్వపన్ దాస్‌గుప్తా
బీజేపీ అగ్రనేత స్వపన్ దాస్‌గుప్తా మాట్లాడుతూ, ఇది ఎన్నికల పరాజయాన్ని జీర్ణించుకోలేక చేసిన "రాజకీయ ప్రతీకార హత్య" అని అభివర్ణించారు. కార్యకర్తలు శాంతిని పాటించాలని కోరుతూనే.. "మే 9న మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ఈ అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం" అని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సీబీఐ విచారణకు డిమాండ్:
అనూహ్యంగా టీఎంసీ కూడా ఈ ఘటనను ఖండించి, సీబీఐ విచారణ కావాలని కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.పోలీసులు చంద్రను చంపడానికి వాడినట్లు అనుమానిస్తున్న ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో ఈ హత్య జరగడం రాజకీయ ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చింది.
అధికార మార్పిడి జరగనున్న వేళ, కాబోయే సీఎం సన్నిహితుడిపైనే దాడి జరగడం బెంగాల్ శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోంది. చంద్ర మృతికి నిందితులెవరు? వారి వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? అన్నది ఇప్పుడు రాష్ట్రంలో మిలియన్ డాలర్ల ప్రశ్న!












Click it and Unblock the Notifications