హిందూ ఓట్ల ఏకీకరణే బీజేపీకి శ్రీరామరక్ష: సువేందు అధికారి
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా ఉండి, ఇప్పుడు ఆమెపైనే సమరశంఖం పూరించిన సువేందు అధికారి విజయబావుటా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నందిగ్రామ్, భవానీపూర్ రెండు చోట్లా పోటీ చేస్తున్న ఆయన.. నందిగ్రామ్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి ఏకంగా 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇక సీఎం మమత ఇలాకా అయిన భవానీపూర్‌లోనూ మొదటి రౌండ్‌లో వెనుకబడినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని 4,200 ఓట్ల లీడ్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

హిందూ ఓట్ల ఏకీకరణ.. ముస్లిం ఓట్ల చీలిక!
ప్రస్తుత ట్రెండ్స్‌పై సువేందు అధికారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి బెంగాల్‌లో "హిందూ ఏకీకరణ" స్పష్టంగా కనిపిస్తోందని, హిందువులంతా కమలం గుర్తు వైపు నిలిచారని ఆయన విశ్లేషించారు. మరోవైపు, టీఎంసీకి బలమైన ఓటు బ్యాంక్ అయిన ముస్లిం ఓట్లు ఈసారి చీలిపోయాయని, మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లడం బీజేపీకి కలిసొచ్చిందని ఆయన పేర్కొన్నారు. భవానీపూర్‌లో కూడా ముస్లిం మెజారిటీ బూత్‌లలో టీఎంసీకి పడాల్సిన ఓట్లలో చీలిక వచ్చిందని ఆయన ఏఎన్ఐ (ANI) తో అన్నారు.
బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..
ప్రాథమిక ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 130కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ 100 స్థానాల వద్ద పోరాడుతోంది. ప్రధాని మోదీ బెంగాల్ అభివృద్ధిపై ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని సువేందు చెబుతున్నారు. "ముందు ముందు రౌండ్లలో మమత లీడ్ సాధించవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం నాదే.. బీజేపీదే" అని ఆయన కుండబద్దలు కొట్టారు.














Click it and Unblock the Notifications