హిందీ, హిందూ వ్యతిరేక రాజకీయాలకు చెక్.. డీఎంకే పతనానికి కారణం అదేనా?
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు అనూహ్య మార్పులను తీసుకువచ్చాయి. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, ఏఐడీఎంకేల ఆధిపత్యానికి తెరదించుతూ దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కేవలం తన సిద్ధాంతాల మీద కాకుండా అధికార పార్టీ వైఫల్యాల మీద కూడా విజయ్ ఆధారపడి ఉందనేది స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అనుసరించిన హిందీ, హిందూ వ్యతిరేక విధానాలే ఈ సారి డీఎంకే కొంపముంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వికటించిన భాషా రాజకీయాలు
డీఎంకే పార్టీ పునాదులే హిందీ వ్యతిరేక ఉద్యమంపై నిర్మించబడ్డాయి. అయితే ఈ సారి కూడా అదే పాత 'హిందీ విధ్వంసం', 'ద్రవిడ అస్తిత్వం' కార్డును స్టాలిన్ బృందం ప్రయోగించింది. కేంద్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. హిందీని రుద్దడం అంటే తమిళ సంస్కృతిని మింగేయడమేనని ప్రచారం చేశారు. కానీ పెరిగిన ఓటింగ్ శాతం, యువ ఓటర్ల నాడిని గమనిస్తే.. వారు పాత భాషా రాజకీయాల కంటే సుపరిపాలన, ఉపాధి, విద్య వంటి అంశాలకే ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోంది. పాత తరం ద్రవిడ రాజకీయాలపై విసుగు చెందిన యువత, విజయ్ చూపిన కొత్త మార్గం వైపు మొగ్గు చూపారు.

సనాతన ధర్మంపై కామెంట్స్ ఎఫెక్ట్
డీఎంకే పతనానికి ప్రధాన కారణం హిందూ వ్యతిరేక ముద్ర అని చెప్పక తప్పదు. 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధులతో పోల్చి.. దానిని పూర్తిగా నిర్మూలించాలని చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తమిళనాడులో హిందూ ఓటర్లు కూడా ఈ కామెంట్ల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఫలితాలు నిరూపిస్తున్నాయి. హిందూ మతపరమైన దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల నిర్వహణలో జోక్యం చేసుకోవడం, పండుగలకు ఆటంకాలు కలిగించడం వంటి చర్యలు డీఎంకేకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఉదయనిధి తన కామెంట్లకు కట్టుబడి ఉంటానని మొండిగా ప్రకటించడం కూడా మధ్యతరగతి హిందూ ఓటర్లను పార్టీకి దూరం చేసింది.
విజయ్ క్లీన్ ఇమేజ్.. డీఎంకే వైఫల్యం
మరోవైపు దళపతి విజయ్ తమిళ అస్తిత్వం గురించి మాట్లాడుతూనే.. మతపరమైన లేదా భాషా వ్యతిరేక అతివాదానికి దూరంగా ఉన్నారు. అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యల పరిష్కారం వంటి సానుకూల నినాదాలతో ఆయన ప్రజల్లోకి వెళ్లారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆయనకు భారీ ఆదరణ లభించింది. 2021లో 133 సీట్లతో ఘనవిజయం సాధించి, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే, కేవలం ఐదేళ్లలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంది. స్టాలిన్ నేతృత్వంలోని సర్కారుపై ఉన్న వ్యతిరేక పవనాలు విజయ్ పార్టీకి వరంగా మారాయి.
ప్రస్తుత ధోరణుల ప్రకారం, 234 సీట్లలో టీవీకే పార్టీ 109 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉండగా.. డీఎంకే కూటమి కేవలం 60 సీట్లకే పరిమితమైంది. తమిళనాడు రాజకీయాల్లో ఇది 'పోస్ట్-ద్రవిడియన్' యుగానికి ఆరంభమని రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. హిందీ, హిందూ వ్యతిరేకతనే ఆయుధంగా చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్న స్టాలిన్, ఉదయనిధిల ప్లాన్ ఈసారి పూర్తిగా బెడిసికొట్టిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications