విజయ పథం.. నా కొడుకు సీఎం కాబోతున్నాడు!
చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఎస్.ఏ. చంద్రశేఖర్ తన కుమారుడి గెలుపుపై ఆనందంతో ఉప్పొంగిపోయారు. " విజయ్ ఈ రోజు ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే అది ఒక రోజులో జరిగింది కాదు. గత 30 ఏళ్లుగా తమిళనాడు కోసం ఏదైనా చేయాలనే తపన అతని మనసులో ఉండేది. ఆ కల ఈ రోజు నెరవేరుతోంది" అని ఆయన పేర్కొన్నారు. 1980ల్లో బాలనటుడిగా విజయ్‌ను వెండితెరకు పరిచయం చేసిన తండ్రిగా, ఇప్పుడు ఒక రాష్ట్రానికే నాయకుడిగా తన కుమారుడు ఎదుగుతుంటే చూడటం గర్వంగా ఉందని ఆయన అన్నారు.

సొంత కాళ్లపై నిలబడ్డ ధీరుడు..
రాజకీయాల్లోకి రాగానే పెద్ద పార్టీలతో పొత్తుల కోసం వెతుక్కోకుండా, 'ఒంటరి పోరాటం' చేస్తానని విజయ్ ప్రకటించడం తనను ఆశ్చర్యపరిచిందని చంద్రశేఖర్ తెలిపారు. "ఎటువంటి పొత్తు లేకుండా తన సొంత కాళ్లపై నిలబడతానని చెప్పడం అతని ధైర్యానికి నిదర్శనం. గత రెండు ఏళ్లుగా 'నేను ముఖ్యమంత్రిగా వస్తాను' అని అతను ప్రదర్శించిన ఆత్మవిశ్వాసమే ఈ రోజు అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది" అని ప్రశంసించారు.
ప్రజలతో రక్త సంబంధం..
విజయ్ విజయం వెనుక కేవలం సినీ గ్లామర్ మాత్రమే లేదని, ప్రజలతో ఆయన ఏర్పరచుకున్న ఆత్మీయ బంధం ఉందని చంద్రశేఖర్ విశ్లేషించారు. "తమిళ ప్రజలు అతన్ని ఒక నాయకుడిగా మాత్రమే చూడటం లేదు. ప్రతి మహిళ తన సొంత కొడుకుగా, యువత తమ సోదరుడిగా, పెద్దలు తమ మనవడిగా ఆయన్ను ఓన్ చేసుకున్నారు. ఆ ప్రేమే ఓట్ల రూపంలో కురిసింది" అని ఆయన వివరించారు. ఇదే క్రమంలో విజయ్ తల్లి శోభ కూడా తన కుమారుడి విజయం పట్ల అమితానందం వ్యక్తం చేశారు. ఆమె కేవలం తల్లి మాత్రమే కాదు, విజయ్‌కు 'మొదటి అభిమాని' అని చంద్రశేఖర్ చమత్కరించారు.
నటుడు కాదు.. ఇప్పుడు 'జన నాయకన్'..
1992లో 'నాళయ్య తీర్పు'తో కథానాయకుడిగా మారిన విజయ్, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు తమిళనాడు రాజకీయ యవనికపై ' జన నాయకన్'గా అవతరించారు. టీవీకే (TVK) పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ద్రవిడ పార్టీలను విస్మయానికి గురిచేసింది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి మహానాయకుల సరసన విజయ్ నిలిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతరం కోరుకుంటున్న 'మార్పు'కు విజయ్ ప్రతిరూపంగా నిలిచారని ఆయన కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications