Iran-US Talks: అమెరికాకు యురేనియం అప్పగింతపై తేల్చేసిన మొజ్తబా ఖమేనీ..!
ఇరాన్ తో అమెరికా చర్చలకు (Iran-US talks) అడ్డంకిగా మారిన యురేనియం అప్పగింత వ్యవహారంపై ప్రతిష్టంభన నెలకొంది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన స్దాయిలో శుద్ధి చేసిన యురేనియాన్ని తమకు అప్పగించి, అణ్వాయుధం తయారు చేయబోమని హామీ ఇస్తేనే వెనక్కి తగ్గుతామని అమెరికా అధ్యక్షుడు పదే పదే కోరుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) స్పందించారు. ఈ మేరకు యురేనియం అప్పగింత విషయంలో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.
ఇరాన్ లో శుద్ధిచేసిన యూరేనియాన్ని విదేశాలకు అప్పగించరాదని తమ నేతలకు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలు ఇచ్చారు. ఇది అమెరికాతో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. కాల్పుల విరమణపై సందేహాలు, యుద్ధ భయాల మధ్య ట్రంప్‌తో చర్చలు మరింత సంక్లిష్టం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. శాంతి చర్చలలో అమెరికా చేసిన డిమాండ్‌కు వ్యతిరేకంగా, అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే ఇరాన్ యూరేనియాన్ని విదేశాలకు ఇచ్చేది లేదని ఖమేనీ స్పష్టం చేశారు.

ఇరాన్ కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. టెహ్రాన్ 400 కిలోగ్రాముల అధిక శుద్ధి చేసిన యూరేనియాన్ని అప్పగించాలని, అణు కార్యకలాపాలను ఒకే కర్మాగారానికి పరిమితం చేయాలని, యుద్ధ నష్టాలకు వాషింగ్టన్ పరిహారం చెల్లించబోదని అంగీకరించాలని అమెరికా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లకు స్పందనగా, ఇరాన్ వర్గాలు రాయిటర్స్‌తో, "అత్యున్నత నాయకుడి ఆదేశం, వ్యవస్థలోని ఏకాభిప్రాయం ఏమిటంటే, శుద్ధి చేసిన యురేనియం నిల్వ దేశం నుండి బయటకు వెళ్లకూడదు" అని తెలిపాయి. గత ఏప్రిల్‌లో, ట్రంప్ తన శుద్ది చేసిన యురేనియం నిల్వలను అప్పగించడానికి ఇరాన్ అంగీకరించిందని, శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇరాన్ దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.














Click it and Unblock the Notifications