చపాతీ న్యుడిల్స్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఇంట్లో రాత్రి మిగిలిపోయిన చపాతీలను చాలామంది మళ్లీ తినడానికి ఇష్టపడరు. అలాంటి చపాతీలతో ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా చపాతీ నూడుల్స్ తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ వంటకం ఉదయం అల్పాహారంగా, సాయంత్రం స్నాక్‌గా లేదా లైట్ డిన్నర్‌గా కూడా బాగా సరిపోతుంది. మార్కెట్‌లో దొరికే మైదా నూడుల్స్ కంటే ఇది ఆరోగ్యానికి మంచిది. పైగా కేవలం 10 నిమిషాల్లోనే తయారవుతుంది.
అలానే వీటిలో చీజ్ తురుము, పనీర్ ముక్కలు లేదా ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసుకుంటే పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. కొద్దిగా వెన్న కలిపితే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఆరోగ్యకరంగా చేయాలంటే ఎక్కువ కూరగాయలు వేసుకోవచ్చు. మైదా నూడుల్స్‌తో పోలిస్తే చపాతీ నూడుల్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు కలపడం వల్ల విటమిన్లు, ఖనిజాలు కూడా శరీరానికి అందుతాయి. మిగిలిపోయిన ఆహారాన్ని వృథా చేయకుండా రుచికరమైన కొత్త వంటకంగా మార్చుకోవడానికి ఇది మంచి మార్గం.

కావలసిన పదార్థాలు
- చపాతీలు - 3 లేదా 4
- నూనె - 2 నుంచి 3 స్పూన్లు
- వెల్లుల్లి తరుగు - 1 స్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
- క్యారెట్ - 1 చిన్నది
- క్యాబేజీ - కొద్దిగా
- క్యాప్సికం - అర కప్పు
- స్ప్రింగ్ ఆనియన్ లేదా కొత్తిమీర - అలంకరణకు
- సోయా సాస్ - 1 స్పూన్
- రెడ్ చిల్లీ సాస్ - 1 స్పూన్
- గ్రీన్ చిల్లీ సాస్ - 1 స్పూన్
- టమాటా సాస్ - 1 స్పూన్
- ఉప్పు - తగినంత
- మిరియాల పొడి లేదా కారం - అర స్పూన్
- చిటికెడు గరం మసాలా (ఐచ్చికం)
తయారీ విధానం..
- ముందుగా చపాతీలను ఒకదానిపై ఒకటి పెట్టి గట్టిగా రోల్ చేయాలి. తరువాత వాటిని కత్తితో సన్నని పొడవాటి ముక్కలుగా కట్ చేస్తే నూడుల్స్‌లా తయారవుతాయి.
- ఇలా కట్ చేసిన చపాతీలను ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి స్వల్పంగా గోధుమరంగు వచ్చే వరకు కలుపుతూ వేపాలి.
- తర్వాత క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. కూరగాయలు పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా క్రంచీగా ఉంటేనే చపాతీ నూడుల్స్ రుచిగా ఉంటాయి.
- ఇప్పుడు సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్ వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి లేదా కారం చల్లి మరో నిమిషం కలుపుతూ వేయించాలి.
- చివరగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ స్ట్రిప్స్‌ను పాన్‌లో వేసి, సాస్ మరియు కూరగాయలు అన్నీ చపాతీలకు బాగా పట్టేలా టాస్ చేయాలి.
- రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌పై కలుపుతూ వేయిస్తే చపాతీ నూడుల్స్ అద్భుతమైన రుచితో సిద్ధమవుతాయి.












Click it and Unblock the Notifications