విజయ్ దెబ్బకి ఐప్యాక్ "ప్యాకప్" ! డీఎంకే కు శాపం..మరి జగన్ పరిస్థితేంటి?
మే 4, 2026.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే దేశ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఐప్యాక్ (I-PAC) ప్రస్థానం ముగింపు దశకు చేరుకుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాడు మోదీని గద్దెనెక్కించి, జగన్‌ను రికార్డు మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసిన అదే వ్యూహచక్రం.. నేడు తమిళనాడులో డీఎంకేను నిట్టనిలువునా ముంచేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభంజనం ముందు ఐప్యాక్ పాచికలు పారలేదని స్పష్టమవుతోంది.
ఎప్పుడూ సందడిగా ఉండే చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం' దగ్గర ఇప్పుడు శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. 2026 ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే కేవలం 50-60 స్థానాలకే పరిమితం కావడం, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. గత ఐదేళ్లుగా ఐప్యాక్ టీం గ్రౌండ్ లెవల్లో సర్వేలు చేస్తూ, సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహించినా.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే డీఎంకే కార్యాలయం వద్ద షామియానాలు తొలగిస్తుండటం, కార్యకర్తలు వెనుతిరగడం ఐప్యాక్ వైఫల్యానికి నిదర్శనంగా మారుతోంది. మరో వైపు విజయ్ గెలుపు ఖాయమని ఐప్యాక్ మాజీ వ్యూహకర్త ముందే చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నుంచి బయటకు వెళ్లడంతోనే ఆ సంస్థ పతనం ప్రారంభమైందనే నానుడి ఉంది. అది ఈ ఫలితాలతో పూర్తిగా నిజమైంది. మరో వైపు ప్రశాంత్ రాజకీయ వ్యూహాలు తన కోసం పని చేయకపోయినా.. తన అంచనాలు తలకిందులు కావనే ఆలోచన కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది.
చెప్పాడు. అన్నట్టు చేశాడు 🙏🏻
— Vennela Kishore Reddy (@Kishoreddyk) May 4, 2026
దండం రా దూత 🔥🔥🔥🔥🔥
అమరీందర్ సింగ్, జగన్, మమతా, చంద్ర బాబు ఇప్పుడు విజయ్ 🔥🔥🔥🔥
ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డ్ 🙏🏻🔥🔥🔥🔥 pic.twitter.com/DDQBZhNDfW
గతవైభవం నుంచి పాతాళానికి.
ఒకప్పుడు 'ఐప్యాక్ వస్తోంది అంటే గెలుపు ఖాయం' అనే నమ్మకం ఉండేది. 2014లో బీజేపీ, ఆ తర్వాత నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్.. ఇలా వరుస విజయాలతో ఈ సంస్థ ఒక బ్రాండ్‌గా మారింది. కానీ, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో ఐప్యాక్ క్రెడిబిలిటీ మొదటిసారి ప్రశ్నార్థకమైంది. కేవలం డేటా విశ్లేషణ, గ్రాఫిక్స్, పెయిడ్ సోషల్ మీడియా పోస్టులతోనే ఎన్నికలు గెలవలేమని ఏపీ ఫలితాలు నిరూపించాయి. అయినప్పటికీ, జగన్ మళ్ళీ ఐప్యాక్ వైపే మొగ్గు చూపుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బెంగాల్ నుంచి తమిళనాడు వరకు.. అన్నీ ఎదురుదెబ్బలే..
2026 ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఐప్యాక్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోసం పనిచేస్తున్న ఐప్యాక్.. అక్కడ కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ సంస్థ కో-ఫౌండర్ వినేష్ చందేల్ అరెస్ట్ వంటి పరిణామాలు, అంతర్గత కుమ్ములాటలు సంస్థను బలహీనపరిచాయి. కేవలం కార్పొరేట్ పద్ధతుల్లో రాజకీయాలు చేయాలని చూడటం, పార్టీ కేడర్‌ను విస్మరించి డేటాపై ఆధారపడటం ఐప్యాక్‌ను దెబ్బకొట్టింది. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌ను ప్రమోట్ చేయడంలో చూపిన ఉత్సాహం.. విజయ్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడి వేగాన్ని అంచనా వేయడంలో విఫలమైంది.
రాజకీయాల్లో వ్యూహాలు అవసరమే కానీ, అవే విజయానికి సోపానాలు కావు. ప్రజల భావోద్వేగాలు, క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలేసి, ఏసీ గదుల్లో కూర్చుని చేసే సర్వేలు ఫలితాన్ని మార్చలేవని 2026 తమిళనాడు ఫలితాలు తేల్చిచెబుతున్నాయి. ఒకప్పుడు దేశాన్ని తనవైపు తిప్పుకున్న ఐప్యాక్.. ఇప్పుడు ప్యాకప్ దిశగా అడుగులు వేస్తోంది. మరి జగన్ లాంటి నాయకులు ఇంకా ఐప్యాక్‌ను నమ్ముకుంటే భవిష్యత్తులో అది ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications