కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ?
తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది, ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ రెండింటికీ మధ్య చాలా జరిగింది. ఫలితమే ఎగ్జిట్ పోల్స్ లో విజయ్ (Vijay) పార్టీ టీవీకే (TVK)పై మారిపోయిన అంచనాలు. ఇప్పుడు అవే అంచనాలు టీవీకేపై ఒత్తిడి కూడా పెంచేస్తున్నాయి. దీంతో ఎల్లుండి జరిగే కౌంటింగ్ కు ముందే పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ కు టీవీకే నేత అధవ్ అర్జున లేఖ రాశారు.
తమిళనాడులో ఓట్ల లెక్కింపు రోజుకు ముందే చట్టం, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో కొన్ని అసాంఘిక శక్తులు తమ టీవీకే పార్టీ కార్యాలయంపై దాడి చేశాయని, త్రిచీ జిల్లాలోని 139 శ్రీరంగం నియోజకవర్గంలో ఉన్న తమ పార్టీ కార్యాలయాన్ని అగ్నికి ఆహుతి చేశాయని అధవ్ అర్జున తెలిపారు. కౌంటింగ్ రోజు ఉదయం నుంచే ఇలాంటి చర్యలు మరికొన్ని చోట్ల జరిగే అవకాశం ఉందని, శాంతియుత లెక్కింపు ప్రక్రియను భంగం చేయాలని, తమ పార్టీ కౌంటింగ్ సెంటర్ ప్రతినిధులు , ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నికల బాధ్యతల నుంచి అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారని విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలిపారు.

కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 కౌంటింగ్ సెంటర్లలో, వాటి చుట్టుపక్కల జరిగే ఇలాంటి అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికి, అలాగే తమ పార్టీ అభ్యర్థులు, టీవీకే ప్రతినిధుల ప్రాణరక్షణ, వ్యక్తిగత భద్రత కల్పించాలని సీఈఓను కోరారు. తక్షణం అధికారులకి దిశానిర్దేశం చేసి, తమిళనాడువ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్ల వద్ద తగిన సంఖ్యలో సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కోరారు. అలాగే ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు చుట్టూ కనీసం ఒక కిలోమీటర్ పరిధిలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతంలో సాధారణ ప్రజల గుంపు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఈ విషయాన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications