విజయ్ TVK పార్టీ స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన 9 సీట్లు ఇవే..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ Tamilaga Vettri Kazhagam (TVK) పార్టీ సంచలన ప్రదర్శనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. దాదాపు అర్ధ శతాబ్దం పాటు డీఎంకే- అన్నాడీఎంకే ల చుట్టూనే తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన పార్టీ సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మేరకు తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం కాగా అధికారాన్ని దాదాపు అందుకునే స్థాయికి చేరుకున్న ఈ పార్టీ, కొన్ని కీలక స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతో కోల్పోయిన ఈ సీట్లు ఫలితాలపై గణనీయ ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్వల్ప తేడాతో చేజారిన కీలక సీట్లు ఏవో తెలుసుకుందాం..

TVK చేజారిన 9 నియోజకవర్గాలు ఇవే..
పాలనీ - డా. ప్రవీణ్ కుమార్ ఎం: 66,293 ఓట్లు | తేడా: -693
కోవిల్పట్టి - బాలసుబ్రహ్మణియన్ ఎస్: 60,800 ఓట్లు | తేడా: -843
ఉధగమండలం - ఇబ్రహీం ఆర్: 47,512 ఓట్లు | తేడా: -976
పాపనాసం - అజరుద్దీన్ ఉదుమాన్ అలీ: 68,219 ఓట్లు | తేడా: -1,065
దిండిగుల్ - నజీర్ రాజా జి: 73,358 ఓట్లు | తేడా: -1,131
కిల్లియూర్ - సాబిన్ ఎస్: 65,123 ఓట్లు | తేడా: -1,311
తిరుమయం - చింతామణి సి: 56,709 ఓట్లు | తేడా: -1,492
పుదుక్కొట్టై - కె.ఎం. షరీఫ్: 64,958 ఓట్లు | తేడా: -1,867
యెర్కౌడ్ - లక్ష్మీ జనార్థనన్ జె: 85,583 ఓట్లు | తేడా: -2,189
ఈ గణాంకాలు చూస్తే, చాలా చోట్ల 1000-2000 ఓట్లలోపే ఫలితాలు మారిపోయాయని స్పష్టమవుతోంది. ఈ సీట్లలో విజయం సాధించి ఉంటే TVK పరిస్థితి మరింత బలంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
డిపాజిట్ ఎక్కడా కోల్పోని అరుదైన రికార్డ్..
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే-TVK పార్టీ పోటీ చేసిన మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా డిపాజిట్ కోల్పోలేదు. ఇది కొత్త పార్టీకి చాలా పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. సాధారణంగా కొత్త పార్టీలకు ఇది చాలా కష్టమైన విషయం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పార్టీకి సమానంగా మద్దతు లభించడం గమనార్హం. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ఓటర్లు TVK వైపు ఆకర్షితులయ్యారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications