ట్రంప్ ‘డబుల్ గేమ్’: ఒకవైపు శాంతి మంత్రం.. మరోవైపు యుద్ధ తంత్రం!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు తన సైనిక వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓ వైపు చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెబుతూనే.. మరోవైపు పశ్చిమాసియాకు అదనంగా మరో 10 వేల మంది సైనికులను పంపేందుకు పెంటగాన్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే తక్షణమే సైనిక చర్య చేపట్టేందుకు వీలుగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రంగంలో అత్యాధునికి డ్రోన్ స్పీడ్ బోట్లు
ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుపుతున్న ఆపరేషన్లలో అమెరికా తొలిసారిగా డ్రైవర్ లేని డ్రోన్ స్పీడ్ బోట్లను వినియోగిస్తున్నట్లు పెంటగాన్ అధికారికంగా ధ్రువీకరించింది. యుద్ధ రంగంలో ఇలాంటి రిమోట్ కంట్రోల్ బోట్లను వాడటం ఇదే మొదటిసారి. మేరీల్యాండ్ కు చెందిన 'బ్లాక్ సీ' కంపెనీ తయారు చేసిన ఈ డ్రైవర్‌లెస్ డ్రోన్ స్పీడ్ బోట్లు ప్రస్తుతం నిఘా కోసం వినియోగిస్తున్నారు. అవసరమైతే వీటి ద్వారా మెరుపు దాడులు కూడా చేసే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" అని పేరు పెట్టారు.

గత అనుభవాలు.. భయంకరమైన జ్ఞాపకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను నమ్మి ఇరాన్ మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ చర్చలు జరుపుతున్న సమయంలోనే ఇరాన్‌పై భారీ దాడులు జరిగాయి. ఆ దాడిలో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు 40 మంది అగ్రశ్రేణి కమాండర్లు మరణించారు. ఇప్పుడు కూడా 10 రోజుల గడువు ఇచ్చి, ఈ లోపు సైన్యాన్ని మోహరించడం ట్రంప్ 'డబుల్ గేమ్' లో భాగమేనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ తరహా యుద్ధ వ్యూహం
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సముద్రపు డ్రోన్లు రష్యా నౌకాదళాన్ని భారీగా దెబ్బతీశాయి. అదే తరహా వ్యూహాన్ని ఇప్పుడు అమెరికా ఇరాన్ విషయంలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా గత నెలలో గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లపై సముద్రపు డ్రోన్లతో దాడులు చేసింది. దీనికి ప్రతిగా అగ్రరాజ్యం అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది.












Click it and Unblock the Notifications