సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్-ఇజ్రాయెల్- అమెరికా దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తింది. చమురు, గ్యాస్ ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే చమురు సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక అట్టుడుకిపోతుంది.
ఇప్పటికే శ్రీలంకలో భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. తాజాగా మరోసారి గ్యాస్ ధరలను పెంచుతూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను శ్రీలంక లోని ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ 'లిట్రో గ్యాస్ లంక లిమిటెడ్' వెల్లడించింది. ఈ మేరకు 12.5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ.775 పెంచింది. దాంతో ప్రస్తుతం 12.5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.4,765 కు చేరింది. అలాగే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 308 పెరిగింది. రూ. 1,910 కు చేరుకుంది. ఇక 2.3 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగింది. దాంతో ఆ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 890 కు చేరింది. ఇక పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.
ఈ మేరకు శ్రీలంకలోని గ్యాస్ సరఫరా సంస్థ లిట్రో గ్యాస్ లంక లిమిటెడ్ స్పందిస్తూ.. ప్రపంచ మార్కెట్ లో పెరిగిన ధరలతో దిగుమతి ఖర్చులు పెరిగాయని తెలిపింది. అయితే రానున్న న్యూ ఇయర్ సీజన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ను దృష్టిలో పెట్టుకుని ధరలను అదుపులోనే ఉంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకుండా చూస్తున్నామని .. గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ నెల కోసం ఆర్డర్ చేసిన 38000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొంది. అలాగే గల్వానీ నౌక ద్వారా 20000 టన్నులు, ఫ్రేసినెట్ నౌక ద్వారా మరో 20000 టన్నుల గ్యాస్ త్వరలోనే దేశానికి రానుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. లిట్రో గ్యాస్ లంక లిమిటెడ్ ఛైర్మన్ చన్నా గుణవర్ధన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగినా ప్రజలు నిరంతరం సరఫరా చేసేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications