స్టాలిన్ వందేళ్ల ప్లాన్..! 38 మందితో టీమ్- నిర్మొహమాటంగా ఫీడ్ బ్యాక్..!
తమిళనాడు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) రూటు మార్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే ఎమ్మెల్యేలను జనంలోకి పంపడంతో పాటు ఓడిపోయిన తాను కూడా నియోజకవర్గానికి వెళ్లి ప్రజల్ని కలిశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా క్యాడర్ నుంచి ఓటమికి కారణాలు, భవిష్యత్తులో పార్టీ ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయాలు తీసుకునేందుకు స్టాలిన్ 38 మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించేందుకు, మొత్తం 234 నియోజకవర్గాలను సందర్శించడానికి 38 మంది సభ్యులతో ఒక బృందాన్ని నియమించానని స్టాలిన్ ట్వీట్ చేశారు. వారితో జరిగిన సమావేశంలో ఈ అధ్యయనాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చానని తెలిపారు. ఇందులో మీలో ప్రతి ఒక్కరూ నా తరపున పంపబడిన నాయకత్వ ప్రతినిధులే. మీరే నా చెవులు అని స్టాలిన్ తెలిపారు. ఎలాంటి వ్యక్తిగత పక్షపాతం లేదా దురభిప్రాయం లేకుండా, నా వద్దకు వచ్చి నాకు నిజం చెప్పడమే మీ పని అన్నారు.

మీరు ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించకూడదు, ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూడకూడదని స్టాలిన్ వారికి స్పష్టం చేశారు. మీరు ఎవరినైనా ఇద్దరి బృందంగా మాత్రమే కలవాలని, ఒక్క వ్యక్తిని ఒంటరిగా కలవకూడదని షరతు పెట్టారు. పార్టీ సభ్యులను వారి మనసులోని మాటలను మాట్లాడనివ్వాలని, వారి బాధలను, ఎన్నికల ఫలితాలకు గల కారణాలను వారు వెల్లడించనివ్వాలని సూచించారు. నాయకుడైన తనను విమర్శించడంలో తప్పులేదని, ఆ విషయాన్ని రాసుకుని, మీ నివేదికలో పొందుపరచాలని కోరారు. క్యాడర్ అభిప్రాయం ఏమిటి? వారు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారనేది తనకు కావాలన్నారు.

వైద్యుడికి అబద్ధం చెప్పకూడదని అంటారని, తాను కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నానని తెలిపారు. తన నుండి ఏదీ దాచవద్దన్నారు. ఒక వ్యాధి ఏమిటో స్పష్టంగా తెలిస్తేనే దానికి మందు ఇవ్వగలరని గుర్తుచేశారు. క్యాడర్ చెప్పే సమాచారాన్ని మరెవరితోనూ పంచుకోకూడదని, ముఖ్యంగా సంబంధిత వ్యక్తులతో అస్సలు పంచుకోవద్దని సూచించారు. మీరు అలా చేస్తే, ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం వృధా అవుతుందని వారికి తెలిపారు. సమస్యలను సరిదిద్దుకుని, మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే రాబోయే 100 సంవత్సరాలు మనుగడ సాగించగలమన్నారు. మీరు ఇచ్చే నివేదిక ఆధారంగా తాను పార్టీలో మార్పులు, సంస్కరణలు చేయబోతున్నానని తెలిపారు. కాబట్టి ఇది స్కాన్ రిపోర్ట్ అంత కచ్చితంగా ఉండాలన్నారు. ఈ రిపోర్ట్‌ను జూన్ 5వ తేదీలోగా సమర్పించాలని, దీనిపై పనిని జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలిపారు. రండి, సోదరుల నిజమైన భావాల గురించి మాకు చెప్పండి అని వారిని కోరారు.














Click it and Unblock the Notifications