బీ అలర్ట్: ఏటీఎంల దగ్గర ఈ తప్పు చేశారో, మీ డబ్బులు గోవిందా!
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ, వీవీఐపీ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో సరికొత్త తరహా ఏటీఎం మోసాలు కలకలం సృష్టిస్తున్నాయి. టెక్నాలజీతో కాకుండా కేవలం చిన్న ఉపాయంతో ప్రజల సొమ్మును దోచుకుంటున్న 'క్యాష్ ట్రాప్' ముఠా జూబ్లీహిల్స్ పరిధిలో రెచ్చిపోతోంది. గత 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో వరుసగా మూడు చోట్ల ఇలాంటి ఘోరాలు జరగడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే సాధారణ ఖాతాదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ముఠా నేరాలకు పాల్పడుతున్న తీరు చాలా విచిత్రంగా, చాకచక్యంగా ఉంటోంది. నిందితులు ముందుగా రద్దీ తక్కువగా ఉండే ఏటీఎంలను టార్గెట్ చేసుకుంటున్నారు. అక్కడ నగదు బయటకు వచ్చే స్లాట్ లోపల ఎవరికీ కనిపించకుండా ఓ ప్లాస్టిక్ కార్డును లేదా ప్రత్యేకమైన ఫైబర్ పట్టీని అమర్చుతున్నారు. దీనివల్ల లోపల ప్రాసెస్ పూర్తయి డబ్బులు బయటకు వచ్చినప్పటికీ.. ఆ ప్లాస్టిక్ కార్డు అడ్డుగా ఉండటం వల్ల ఖాతాదారుడి చేతికి నగదు అందకుండా అక్కడే ఉండిపోతుంది.

సాధారణంగా ఏటీఎం స్క్రీన్‌పై లావాదేవీ విజయవంతమైందని మెసేజ్ వచ్చినప్పటికీ.. చేతికి డబ్బులు రాకపోవడంతో ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఏటీఎం మెషీన్లో సాంకేతిక లోపం లేదా క్యాష్ అయిపోయి ఉంటుందని భావించి.. కొద్దిసేపు ఎదురుచూసి అక్కడి నుంచి వెనుతిరుగుతున్నారు. ఖాతాదారులు అలా ఏటీఎం సెంటర్ నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే.. బయట నిలబడి నిఘా ఉంచిన ముఠా సభ్యులు లోపలికి ప్రవేశిస్తున్నారు. స్లాట్‌లో తాము పెట్టిన ప్లాస్టిక్ కార్డును తొలగించి, అందులో ఇరుక్కుపోయిన నగదును కొల్లగొట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి పరారవుతున్నారు.
ఈ వరుస దొంగతనాలపై బాధితులు బ్యాంకు అధికారులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతిక లోపం లేకపోయినా ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులు కట్ కావడం, ఏటీఎంలో నగదు తక్కువగా చూపించడంతో అలర్ట్ అయిన బ్యాంక్ మేనేజర్లు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికల ఆధారంగా ఈ 'క్యాష్ ట్రాప్' ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఏటీఎంలలో డబ్బులు రానప్పుడు వెంటనే బ్యాంకును లేదా పోలీసులను సంప్రదించాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications