ఒక్క లేఖతో మారిన దేశం పేరు! 'పర్షియా' కాస్తా 'ఇరాన్'గా ఎలా మారింది?
Iran History: ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త 'సుప్రీం లీడర్'గా 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' ఎంపిక చేసింది. అయితే ఈ ఇరాన్ చరిత్ర నేటిది కాదండోయ్.. అది సుమారు 500 ఏళ్ల క్రితం నాటి ఎలామైట్స్ నాగరికతతో ముడిపడి ఉంది. అయితే, ఆధునిక ఇరాన్‌కు అసలైన పునాది క్రీస్తు పూర్వం 550-330 మధ్య కాలంలో 'అచమెనిడ్ సామ్రాజ్యం' ద్వారా పడింది. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన 'సైరస్ ద గ్రేట్' కాలంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా విరాజిల్లింది. ఈ సామ్రాజ్యానికి కేంద్ర బిందువు 'పార్స్' (Pars) అనే ప్రాంతం. ఈ ప్రాంతం పేరు మీదగానే అక్కడి సంస్కృతి, భాష గుర్తింపు పొందాయి.
పాశ్చాత్య దేశాల్లో 'పర్షియా'గా గుర్తింపు:
ఈ దేశాన్ని విదేశీయులు 'పర్షియా' అని పిలవడం వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. పురాతన కాలంలో గ్రీకు రచయితలు, చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, సామ్రాజ్య కేంద్రమైన 'పార్స్' పేరును బేస్ చేసుకుని తమ పుస్తకాల్లో ఈ దేశాన్ని 'పర్షియా' అని ప్రస్తావించారు. కాలక్రమేణా గ్రీకు ప్రభావంతో పాశ్చాత్య దేశాలన్నింటిలో ఈ పేరు స్థిరపడిపోయింది. అంటే విదేశీయులకు ఇది పర్షియాగా తెలిసినప్పటికీ.. స్థానిక ప్రజలు మాత్రం తమను తాము ఎప్పుడూ ఇరానియన్లుగానే గుర్తించుకునేవారు.

'ఇరాన్' అంటే అర్థం ఏమిటి?:
స్థానిక భాషలో 'ఇరాన్' అనే పదానికి గొప్ప అర్థం ఉంది. ఇది పురాతన పర్షియన్ పదం 'ఆర్యానామ్' నుంచి ఉద్భవించింది. దీనికి అర్థం 'ఆర్యుల భూమి'. ఇండో-ఇరానియన్ తెగలకు చెందిన ప్రజలు తమ ఉమ్మడి సాంస్కృతిక, భాషా మూలాలను ప్రతిబింబించేలా ఈ పేరును వాడుకలో ఉంచారు. బయటి ప్రపంచానికి పర్షియాగా సుపరిచితమైనా..వేల ఏళ్లుగా ఈ గడ్డపై ఉన్న ప్రజల గుండెల్లో తమ దేశం పేరు ఎప్పుడూ 'ఇరాన్' గానే ఉంది.
రెజా షా పహ్లావి నిర్ణయం - 1935 నాటి మార్పు:
20వ శతాబ్దంలో ఇరాన్ ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, 1935లో పహ్లావి రాజవంశ స్థాపకుడు 'రెజా షా పహ్లావి' ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టర్కీలో కమల్ అటాతుర్క్ తీసుకువచ్చిన సంస్కరణల ద్వారా ప్రభావితమైన రెజా షా.. తన దేశానికి వలసవాద గుర్తులను చెరిపివేసి ఒక కొత్త, శక్తివంతమైన గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్షించారు. 'పర్షియా' అనేది పాశ్చాత్యులు ఇచ్చిన పేరు అని.. అది దేశంలోని కేవలం ఒక ప్రాంతానికే పరిమితమని ఆయన భావించారు.
అధికారికంగా ఇరాన్ ఆవిర్భావం
దేశంలోని వివిధ తెగలు, జాతుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి 'ఇరాన్' అనే పేరు సరైనదని రెజా షా నమ్మారు. అందుకే 1935లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు ఆయన అధికారిక లేఖలు రాశారు. ఇకపై దౌత్యపరమైన వ్యవహారాల్లో 'పర్షియా' అనే పదాన్ని వాడకూడదని.. తమ దేశాన్ని 'ఇరాన్' అని మాత్రమే పిలవాలని ఆదేశించారు. ఈ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ వేదికలపై ఈ దేశం తన పురాతన, స్వదేశీ నామమైన 'ఇరాన్'తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.












Click it and Unblock the Notifications