ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ కోరుకుంటున్నట్లు ఇరాన్ వెల్లడించిందని అన్నారు. అయితే హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. హార్మూజ్ జలసంధిలో స్వేచ్ఛగా చమురు, వాణిజ్యం జరిగినప్పుడే కాల్పుల విరమణ ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటివరకూ ఇరాన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈమేరకు ట్రంప్.. తన వ్యక్తిగత సోషల్ మీడియా ట్రూత్ మాధ్యమంలో పోస్టు చేశారు.
ఇరాన్ నూతన అధ్యక్షుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఆయన పోస్టులో ఇరాన్ కు చెందిన ఫలానా నాయకుడి పేరును మాత్రం ప్రస్తావించలేదు. " ఇరాన్ లో పాలన సాగిస్తున్న నూతన అధ్యక్షుడు.. గత సుప్రీం లీడర్ల కంటే ఇంటెలిజెంట్.. ఇప్పుడు అమెరికాతో సీజ్ ఫైర్ కోరుకున్నారు. అతడి అభ్యర్థనను హార్మూజ్ జలసంధి ఓపెన్ అయితేనే పరిశీలిస్తాం. హార్మూజ్ జలసంధి ఇదివరకు లాగే చమురు, వాణిజ్యం రవాణా సరఫరా సజావుగా సాగితేనే ఇరాన్ అభ్యర్థనను పరిశీలిస్తాం. అప్పటివరకు ఇరాన్ పై దాడులను కొనసాగిస్తూనే ఉంటాం. వాళ్లను స్టోన్ ఏజ్ కు పంపిస్తాం" అని ట్రంప్ కీలక వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ చేసిన పోస్టుకు ఇరాన్ ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం.

ఇక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు కొరత తీవ్రంగా ఉంది. ఎన్నో దేశాల్లో ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు సరఫరాలో 20 శాతం హార్మూజ్ జలసంధి మీదుగానే రవాణా జరుగుతూ ఉంటుంది. ఇక రోజూ భారత్ కు వచ్చే 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు హార్మూజ్ మీదుగానే వస్తుంటుంది. అలాగే భారత్ కు చెందిన 40 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతులు, 54 శాతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతులు హార్మూజ్ జలసంధి మీదుగానే వస్తుంటాయి.












Click it and Unblock the Notifications