హైదరాబాద్ లో గ్యాస్ మాఫియా.. సజ్జనార్ కీలక ఆదేశాలు..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇక తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో గ్యాస్ మాఫియా పెరుగుతోంది. అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సామాన్యుల కళ్లముందే జరుగుతున్న దోపిడీని అప్రమత్తతతో ఎండగట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. ధైర్యంగా గ్యాస్ మాఫియా గుట్టురట్టు చేయడాన్ని కొనియాడారు.
ఏం జరిగిందంటే..?
చూడిబజార్ కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ గత నెల 21న గ్యాస్ సిలిండర్ ను బుక్ చేశారు. డెలివరీ సమయంలో బరువు తక్కువగా ఉండటాన్ని ఆయన కుమారుడు నమాన్ తివారి గమనించారు. గత డెలివరీ సమయంలోనూ ఇలాగే సిలిండర్ రెండు కిలోలు తక్కువగా ఉందని తన తండ్రి దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్, కేవలం 28 కిలోల బరువు మాత్రమే ఉందని చెప్పారు. అయితే గత కొంతకాలంగా గ్యాస్ త్వరగా అయిపోతుండటంతో అనుమానం వచ్చి బరువు తనిఖీ చేయగా సుమారు రెండు కిలోల గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తేలింది.
తనకు గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేసే సిద్ధార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం ఇచ్చారు. అయితే పట్టువదలని తండ్రీకొడుకులు దీనిపై ఆరా తీయగా, సదరు ఏజెన్సీ ఉద్యోగులు గ్యాస్ సిలిండర్లను జుమేరాత్ బజార్ లోని ఒక ఇంట్లో అక్రమంగా చిన్న సిలిండర్లలోకి, వాణిజ్య అవసరాల కోసం రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేవలం గ్యాస్ తక్కువగా ఇవ్వడమే కాకుండా అత్యంత ప్రమాదకర రీతిలో రీఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిద్దార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా సాయి కుమార్, వినీత్ కుమార్, పూస గణేష్, ప్రవీణ్ కుమార్, అమిత్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కమర్షియల్, 7 డొమెస్టిక్, 12 చిన్న సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు ఇదే విషయంపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. వినియోగదారులు కూడా తమకు అందే వస్తువుల నాణ్యత, పరిమాణంపై నిరంతరం నిఘా ఉంచాలని, గృహా గ్రాహకులుగా మారాలని పిలుపునిచ్చారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కు పాల్పడేవారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా మోసం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.












Click it and Unblock the Notifications