ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా వేతనాల పెరుగుదల, ఎవరికి ఎంత- బకాయిలు అప్పుడే..!!
ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగనున్నాయి. తాజాగా సమ్మె విరమణ సమయంలో ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వంతో చేసిన చర్చలు ఫలించాయి. అందులో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటుగా 11 శాతం ఫిట్మెంట్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో.. ఈ తాజా వేతన సవరణలో భాగంగా ఆర్టీసీలో పని చేస్తున్న పలు కేటగిరీలకు చెందిన వారి వేతనాలు పెరగనున్నాయి. సంస్థలోని 37,360 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అదే విధంగా బకాయిల చెల్లింపు పైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. తాజాగా సమ్మె విరమణ చర్చల వేళ జరిగిన ఒప్పందం మేరకు 11 శాతం ఫిట్మెంట్ ఖరారు చేసారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పైనా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన వసరణ అమలు చేసేందుకు నిర్ణయం జరిగింది. తాజాగా తీసుకున్న 11 శాతం ఫిట్మెంట్ ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతో పాటుగా 2021 ఏప్రిల్ 1 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అమలు కానుంది. అప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిలు రిటైర్మెంట్ సమయంలో చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో సంస్థ పైన రూ 2400 కోట్ల పైగా భారం పడుతుందని లెక్కలు వేసారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు రూ 2,178 కోట్లు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా పదవీ విరమణ చేసిన వారికి రూ 230 కోట్లు ఇవ్వాలని తేల్చారు.

ఎవరికి ఎంత మేర పెరుగుతుందంటే..
ఇక, తాజాగా ఖరారు పెంచిన 11 శాతం ఫిట్మెంట్ తో ప్రతీ నెలా రూ 34.06 కోట్లు.. ఏటా రూ 415.2 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కలు వేసారు. ఇదే లెక్కల ప్రకారం ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పెరిగే వేతనాల పైనా స్పష్టత వచ్చింది. ఉద్యోగుల సర్వీసుకు అనుగుణం గా కండక్టర్లకు 4000 - 15000 వరకు, అదే విధంగా డ్రైవర్లకు 4000-17000 వరకు వేతనాలు పెరుగుతాయని వెల్లడించారు. కాగా.. వేతన సవరణ ప్రయోజనం పొందే ఉద్యోగుల సంఖ్య సైతం భారీగా ఉంది. 2021 -22 లో ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య 46988 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 37,360 గా ఉంది. ఇక లబ్ది పొందే విశ్రాంతి ఉద్యోగుల సంఖ్య 9600 కు పగా ఉంటుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications