టమాటా: అప్పుడు రూపాయికే కేజీ. ఇప్పుడు..?
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు మళ్లీ మండుతున్నాయి. గత నెలలో రూపాయికే కిలో అమ్ముడుపోయిన టమాటా, ఇప్పుడు ఏకంగా అర్ధ సెంచరీ దాటేసింది. ఈ ధరల పెరుగుదలపై సామాన్యుడు షాక్ తింటుంటే, రైతు కన్నీటి కథ మాత్రం వేరేలా ఉంది.
వంటింట్లో రారాజుగా వెలిగే టమాటా ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. అయితే, ఈ ధరల పెరుగుదల వెనుక సాగు తగ్గడం, ఎండల తీవ్రత వంటి కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో టమాటా రైతు గోడు మాత్రం వర్ణనాతీతంగా ఉంది.
మార్కెట్‌లో 'ఎర్ర'బడ్డ ధరలు.. సామాన్యుడికి బేజారు
హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లలో కిలో రూ. 30 నుంచి రూ. 40 మధ్య అమ్ముడవుతుండగా, రిటైల్ షాపులు, సూపర్ మార్కెట్లకు వచ్చేసరికి అది రూ. 50 నుంచి రూ. 60 కి చేరుతోంది. ఏపీలోని మదనపల్లి వంటి ప్రధాన మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. నిన్నమొన్నటి వరకు కిలో రూ. 5 నుంచి రూ. 10 కి దొరికిన టమాటా, ఇప్పుడు ఒక్కసారిగా రేటు పెంచేయడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కూరగాయల సంచిలో రెండు కిలోలు వేసుకునే వారు, ఇప్పుడు అరకిలోతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రైతు కన్నీరు: అప్పుడు ధర లేదు.. ఇప్పుడు పంట లేదు!
టమాటా ధరలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పైకి కనిపిస్తున్నా, వాస్తవం మాత్రం చాలా చేదుగా ఉంది. సరిగ్గా నెల రోజుల క్రితం పరిస్థితిని గమనిస్తే.. అప్పట్లో రైతుల దగ్గర నుంచి కిలో రూపాయికే వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ప్రజలకు రూ. 5 కి అమ్మారు. కూలీల ఖర్చులు, రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో విసుగు చెందిన రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. కొందరు రోడ్లపై టమాటాలను పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. భానుడి భగభగలకు పొలాల్లో ఉన్న నాటు టమాటా పంట అంతా నాశనమైపోయింది. పందిరి సాగు (Trellis farming) చేసిన రైతులకు మాత్రమే ఇప్పుడు కొంత పంట అందుబాటులో ఉంది.
లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
ప్రస్తుతం ధర పెరగడం వల్ల ప్రయోజనం పొందుతున్నది కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే. గత రెండు నెలలుగా పంట పుష్కలంగా ఉన్నప్పుడు ధర లేక మెజారిటీ రైతులు నిలువునా మునిగిపోయారు. "పంట చేతిలో ఉన్నప్పుడు ధర ఉండదు.. ధర ఉన్నప్పుడు మా దగ్గర పంట ఉండదు" అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడం వల్ల పందిరి సాగు చేసిన పెద్ద టమాటాలకు గిరాకీ పెరిగింది, కానీ సాధారణ నాటు టమాటా రైతులు మాత్రం అప్పుల ఊబిలోనే ఉండిపోయారు.
ముందున్నది ముసళ్ళ పండుగేనా?
సాగు తగ్గడం, ఎండల తీవ్రతకు పూత రాలిపోవడంతో వచ్చే రోజుల్లో సరఫరా మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే టమాటా ధర కిలో రూ. 80 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు పండించిన రైతుకు లాభం అందక, ఇటు కొనే సామాన్యుడికి భారం తప్పక.. టమాటా రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications