ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం - డ్రైవర్ ఆత్మహత్యా యత్నం..!!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. రెండో రోజు పలు డిపోల ఎదుట కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. అటు ఆర్టీసీ యాజమాన్యం సమ్మె విరమణ దిశగా ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇటు కేబినెట్ భేటీ జరుగుతోంది. ఆర్టీసీ సమ్మె..కార్మిక సంఘాల డిమాండ్ల పైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యా యత్నం సమ్మె వేళ మరింత ఉద్రిక్తగా మారుతోంది. దీంతో.. ప్రభుత్వ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు డిపోల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చొరవ చూపాలని, ప్రభుత్వంతో తిరిగి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. ఇటు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న వేతన సవరణ.. ప్రభుత్వంలో విలీనం గురించి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. వీటి పైన మరి కాసేపట్లో జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

కేబినెట్ నిర్ణయం పై ఆసక్తి
కాగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్ ను తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ప్రభుత్వం సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను కోరింది. ప్రభుత్వం నియమించిన కమిటీ తో చర్చలు చేయాలని సూచన చేసింది. ఇక.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. ప్రభుత్వం అసలు సమస్యలు పక్కన పెట్టి కేబినెట్ అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ మీద అప్పుడు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. కార్మికుల పక్షాన ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications