TCS Lays Offs: 3 నెలల్లో 19755 మంది అవుట్-మార్చి కల్లా..టీసీఎస్ షాకింగ్..!
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది ఉద్యోగాల కోతలతో వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు సంస్థ వేగంగా ఏఐకి మారిపోతుండటం, మరోవైపు అమెరికాతో దెబ్బతిన్న భారత దేశ సంబంధాలు టీసీఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు నెలల కాలంలోనే దాదాపు 20 వేల ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని టీసీఎస్ తాజాగా ప్రకటించింది. అలాగే భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీపైనా స్పష్టత ఇచ్చింది.
గత సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 19,755 మంది ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ లెక్కలు చెప్తున్నాయి. ఇందులో కంపెనీ తొలగించిన సిబ్బందితో పాటు స్వచ్ఛందంగా వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు.తాజా పరిణామాలతో టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య గత త్రైమాసికంతో పోలిస్తే 3.2 శాతం తగ్గింది. మార్చి 2022తో ముగిసిన సంవత్సరం తర్వాత మొదటిసారిగా 6 లక్షల కంటే తక్కువకు ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. అయినా ఇంకా కోతలపై టీసీఎస్ ఆలోచనలు చేస్తూనే ఉంది.

మరోవైపు ఈ త్రైమాసికంలో ఉద్యోగులను పంపించే క్రమంలో ఖర్చుల కోసం టీసీఎస్ 11.35 బిలియన్ రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. నైపుణ్యం, సామర్థ్య అసమతుల్యత కారణంగా ప్రధానంగా మధ్య, సీనియర్ లెవెల్ ఉద్యోగులు ఎక్కువగా ఇందులో ప్రభావితం అయినట్లు టీసీఎస్ తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవ్వాలనుకున్న లేఆఫ్స్ లో ప్రస్తుతం సగం దూరానికి చేరుకున్నట్లు వెల్లడించింది. అంటే వచ్చే మార్చి కల్లా మరో 20 వేల మందిపై లేఆఫ్ కత్తి వేలాడుతున్నట్లే.

అమెరికా సుంకాల ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉన్నా..ఐటీ ఖర్చు కోతలు, పెరిగిన భౌగోళిక రాజకీయ అనిశ్చితి టీసీఎస్ వంటి టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే హెచ్1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి టీసీఎస్ తన ఉద్యోగులను అమెరికాలోనూ తగ్గించేస్తోంది. అయితే తమ సంస్థ భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను నియమించుకోవడాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. అంటే ఏఐ సంబంధిత ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నమాట. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు టీసీఎస్ సంకేతాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications