Bulusu Sambamurti: దేశం మరిచిపోయిన అచంచల దేశభక్తుడు
అమరావతి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఏడాది కాలంగా ఈ వేడుకలు దేశవ్యాప్తంగా వేర్వేరు సందర్భాల్లో ఘనంగా కొనసాగుతూ వస్తోన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్టున ముగింపు వేడుకలను అంతే వైభవంగా నిర్వహించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
తెర వెనక హీరోలు..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని తెరపైకి రాని కొందరు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను పరిచయం చేస్తోంది. స్వాతంత్య్ర పోరాట సమరయోధులు, త్యాగధనులు కనుమరుగైపోయిన వారి కథనాలను వెలికి తీసే ప్రయత్నానికి పూనుకొంది. ఈ క్రమంలో దేశం విస్మరించిన దేశభక్తుల పేర్లను కొంతవరకైనా పాఠకులకు తెలియజేయాలని సంకల్పించింది. అలాంటి వారిలో బులుసు సాంబమూర్తి ఒకరు.

బులుసు సాంబమూర్తి..
మహర్షిగా బిరుదు పొందిన ఆ మహోన్నత వ్యక్తి జాడ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయింది. బులుసు సాంబమూర్తి వృత్తిరీత్యా న్యాయవాది. మద్రాస్ ప్రెసిడెన్సీ అసెంబ్లీకి మొట్టమొదటి స్పీకర్ కూడా. తన న్యాయవాద వృత్తిని త్యజించి ఆయన దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోరాడారు. ఆయన స్వస్థలం రాజమండ్రి సమీపంలోని దుళ్ల గ్రామం. విజయనగరం మహారాజా కాలేజీలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేశారు.
న్యాయవాద వృత్తిలో..
మద్రాసులో బీఏ, బీఎల్ పూర్తి చేశారు. 1911లో కాకినాడలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. క్రిమినల్ లాయర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. దేశభక్త కొండా వెంకటప్పయ్య ప్రసంగం ఆయన ఆలోచలను మార్చివేసింది. న్యాయవాద వృత్తిని వదిలేశారు. వస్త్రధారణలో జాతిపిత మహాత్మాగాంధీని అనుసరించారు. ఖద్దరు పంచె, పైన ఉత్తరీయం ధరించే వారు. సత్యాగ్రహాన్ని పాటించారు. 1909లో బులుసు సాంబమూర్తి మొదటిసారిగా జైలుకు వెళ్లారు.
గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం..
హోమ్‌రూల్ ఉద్యమాన్ని నడిపించారు. సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. 1921లో టంగుటూరి ప్రకాశం పంతులు అధ్యక్షతన కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. 1924లో గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమానికి రూపకల్పన చేశారు. సబర్మతీ ఆశ్రమం మాదిరిగా రెండవ గాంధేయవాద ఆశ్రమంగా ఇది పేరు తెచ్చుకుంది. 1927 సంవత్సరంలో నాగ్‌పూర్ సత్యాగ్రహానికి సారథ్యాన్ని వహించారు. సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1929లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు.
ఉప్పు సత్యాగ్రహంలో..
ఉప్పు సత్యాగ్రహ సమయంలో తన అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో ప్రదర్శనలను నిర్వహించారు. సముద్ర తీరంలో ఉప్పును తయారు చేశారు. 1935లో మద్రాసు ప్రొవిన్షియల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. సీ రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి అసెంబ్లీ మొట్టమొదటి స్పీకర్‌గా బులుసు సాంబమూర్తి ఎన్నికయ్యారు. అనంతరం ఆ పదవికి రాజీనామా చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం..
స్వాతంత్య్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడారు. పొట్టి శ్రీరాములు చేపట్టిన ఆంధ్ర రాష్ట్రం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. చెన్నై మైలాపూర్‌లో ఉన్న తన ఇంటిని నిరాహార దీక్ష వేదికగా మార్చారు. పొట్టి శ్రీరాములు బలిదానం అనంతరం ఆ ఇంటిని అమరజీవి స్మారక భవనంగా మార్చారు. 1958 ఫిబ్రవరి 3వ తేదీన బులుసు సాంబమూర్తి కాకినాడలో కన్నుమూశారు. మహర్షిగా ఆయనకు గౌరవం లభించింది. ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్‌ను కేంద్రం విడుదల చేసింది.












Click it and Unblock the Notifications