వాతావరణంలో ఒక్కసారిగా, అల్ప పీడనం ఎఫెక్ట్- ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు...!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్క సారిగా మార్పు వచ్చింది. మరో వేసవి అన్నట్లుగా వేడి తీవ్రత.. ఉక్కపోతల వేళ చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడన ప్రభావం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. అల్ప పీడన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, ఆ సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజుల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

భారీ వర్షాల పై అలర్ట్స్
అదే విధంగా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన చేసింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. తీరంలో అలల ఉధృతి పెరుగుతున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ రోజు (శనివారం ) విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications