జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో ఆ సినిమా చేసి కోలుకోలేకపోయిన మహేష్ బాబు
సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే శ్రీమంతుడు చిత్రం తర్వాత ఆయన కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ వసూళ్లను సాధించాయి. మధ్యలో వచ్చిన గుంటూరు కారం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, నిర్మాతలకు మాత్రం లాభాలనే తెచ్చిపెట్టిందని స్వయంగా నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. అయితే కెరీర్ ఆరంభంలో మహేష్ బాబుకు కూడా వరుసగా కొన్ని వరుస అపజయాలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన ఆ స్థాయి విజయాన్ని అందుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో వచ్చిన భారీ చిత్రాల్లో అతిథి ఒకటి. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో, సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను థియేటర్లలోకి మళ్లీ తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ చెప్పడంతో ఓకే అన్న మహేష్
నిజానికి దర్శకుడు సురేందర్ రెడ్డి అతిథి కథను మొదట మహేష్ బాబు కోసం రాయలేదు. ఆయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ లైన్ అనుకున్నారు. తారక్‌కు అతిథి కథతో పాటు అశోక్ కథను కూడా సురేందర్ రెడ్డి వినిపించారు. అయితే ఎన్టీఆర్‌కు అశోక్ లైన్ బాగా నచ్చడంతో ఆ సినిమా చేయడానికి మొగ్గు చూపారు. అదే సమయంలో అతిథి కథ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన స్టార్‌డమ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఎన్టీఆరే స్వయంగా సురేందర్ రెడ్డికి సజెస్ట్ చేశారు.
తారక్ ఇచ్చిన సలహాతో ఈ కథ మహేష్ బాబు చెంతకు చేరింది. ఎన్టీఆర్ రికమండ్ చేశాడని తెలియడం, లైన్ కూడా కొత్తగా అనిపించడంతో మహేష్ బాబు మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తన సొంత అన్నయ్య జి. రమేష్ బాబు నిర్మాణంలో 'కృష్ణ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై పట్టాలెక్కించారు.
అమృతారావును ఎంపిక చేశారు
మొదట ఈ సినిమాలో కథానాయికగా వేరే నటిని అనుకున్నప్పటికీ, చివరికి అమృతా రావును ఎంపిక చేశారు. అయితే షూటింగ్ దశలో మహేష్ బాబు సూచనల మేరకు కథలో కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం ప్రముఖ రచయిత వక్కంతం వంశీ రంగంలోకి దిగారు. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం క్లైమాక్స్‌లో చిన్నారి పాప చనిపోయే సీన్ లేదు. కానీ ఎమోషన్ పీక్స్‌లో ఉంటుందని భావించి చివరి నిమిషంలో ఆ సీన్‌ను యాడ్ చేశారు. థియేటర్లలో ఈ ఎమోషన్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని, ఆ ఒక్క సీన్ వల్లే సినిమా ఫలితం మారిపోయిందని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. 2007 దసరా కానుకగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
అయినప్పటికీ మహేష్ బాబుకున్న క్రేజ్ కారణంగా భారీ నష్టాల నుంచి ఈ చిత్రం తప్పించుకోగలిగింది. అప్పట్లో థియేటర్లలో నిరాశపరిచిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బుల్లితెరపై మాత్రం మంచి రేటింగ్‌లను సాధించింది. ముఖ్యంగా ఇందులోని మహేష్ బాబు లుక్స్, మణిశర్మ సంగీతం, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతాయి. అప్పట్లో మిస్ అయిన రికార్డులను ఇప్పుడు రీ-రిలీజ్‌లో ఈ 'అతిథి' ఎంతవరకు సాధిస్తాడో చూడాలి.












Click it and Unblock the Notifications