షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక స్వర్ణయుగంలో ఉందని చెప్పొచ్చు. హాలీవుడ్ స్థాయికి ధీటుగా, అవసరమైతే వారికంటే ఎక్కువ బడ్జెట్ తో ఎక్కడా రాజీపడకుండా భారీ వ్యయంతో సినిమాలు రూపొందిస్తున్నారు మన నిర్మాత, దర్శకులు. ఇవన్నీ రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటున్నారు. రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' మొదలుకొని రాజమౌళి 'వారణాసి' వరకు.. అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలను పరిశీలిద్దాం.
రామాయణ
రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, నితీష్ తివారీ దర్శకత్వంలో రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రాబోతోంది రామాయణ. ఇందులో రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. 2026 దీపావళికి ఒక భాగం, 2027 దీపావళికి ఒక భాగం విడుదల కాబోతోంది. మల్హోత్రాతోపాటు యష్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వారణాసి
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' రెండో స్థానంలో ఉంది. రూ.1500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు.
అల్లు అర్జున్ - అట్లీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రూ.900 కోట్లతో తెరకెక్కుతోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అట్లీకి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కల్కి 2898 AD పార్ట్ 2
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ సృష్టించిన విజువల్ వండర్ 'కల్కి'కి సీక్వెల్ మరింత భారీస్థాయిలో రాబోతోంది. దీని బడ్జెట్ రూ.700 కోట్లుగా ఉంది. పార్ట్-2లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. దీపికా పదుకొణె తప్పుకోవడంతో సాయి పల్లవి నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
టాక్సిక్
రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న 'టాక్సిక్' రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. కియారా అద్వానీ, నయనతార వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రం వాస్తవానికి మార్చిలో 'ధురంధర్ 2'తో పాటు విడుదల కావాల్సి ఉంది. అయితే మధ్య ప్రాశ్చ్య దేశాల్లో యుద్ధం జరుగుతుండటంతో షూటింగ్ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications