అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదలలో నెలకొన్న జాప్యంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ విషయంలో ఎన్డీఏ నిందించడం అన్యాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుతో తనకున్న అనుభవాలను ఆయన పంచుకున్నారు. సెన్సార్ బోర్డు ఆమోదం పొందేలా, ఆ స్థాయిలో జన నాయగన్ ను నిర్మాతలు తీర్చిదిద్దలేకపోయారని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. ఆ సినిమాతో పాటు తెరకెక్కిన 'ఓజీ' చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ వచ్చిందని గుర్తు చేశారు.

హింసాత్మక సన్నివేశాలు ఉండటం వల్లే ఓజీకి ఏ సర్టిఫికెట్ వచ్చిందని వ్యాఖ్యానించారాయన. తాను ఎన్డీఏలో భాగస్వామి కావడం వల్లే ఓజీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారని చిత్ర నిర్మాతలు, దర్శకుడు చెప్పగా దాన్ని తోసిపుచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. చిత్రం నిండా హింసాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ.. యూ/ఏ సర్టిఫికేట్ ఎలా ఆశించారని వారిని ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు. నిబంధనలు అందరికీ ఒకటేనని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా మార్చలేమని వారికి చెప్పానని అన్నారు.
ఓజీకి నిర్మాతలు క్లీన్ యూ/ఏ సర్టిఫికేషన్ ఆశిస్తూ మరోసారి దరఖాస్తు చేసుకోగా చివరికి సీబీఎఫ్సీ 'ఏ' సర్టిఫికేట్ తో సరిపెట్టిందని అన్నారు. సెన్సార్ బోర్డులో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి సీబీఎప్సీ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. అందుకు ప్రయత్నించలేదని, సినిమా- సెన్సార్ షిప్ ఎప్పుడూ లింక్ కాదని, అవి వేర్వేరు సంస్థలని పవన్ వ్యాఖ్యానించారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో కూడా ఒక పాటలోని సాహిత్యాన్ని మార్చమని సెన్సార్ బోర్డు కోరినప్పుడు తాను దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. సెన్సార్ బోర్డులో ఇది అందరికీ జరుగుతుందని, జన నాయాగన్ నిర్మాతలు పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించి ఉండాల్సింది కాదని పవన్ పేర్కొన్నారు. కోర్టుకు వెళ్ళకుంటే, పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని, ఒకసారి అది న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత, ఫలితం కోర్టు చేతుల్లో ఉంటుందని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications