'పెద్ది' సినిమాపై వ్యూహాత్మకంగా కుట్ర చేస్తున్న కొందరు నిర్మాతలు?
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య అద్దె విధానం విషయంలో పెద్ద యుద్ధమే మొదలైంది. ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా, థియేటర్ వసూళ్లలో వాటా ఇస్తేనే సినిమాలను ఆడిస్తామంటూ దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ వంటి ప్రముఖ ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. అయితే, ఈ డిమాండ్ వెనుక ఉన్న సమయం, ఉద్దేశాలపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎగ్జిబిటర్ల ప్రకటనపై మైత్రీ మూవీస్ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ వంటి అగ్ర నిర్మాతలు తీవ్రంగా స్పందించారు.
ముఖ్యంగా శిరీష్ రెడ్డి తీరును తప్పుబడుతూ రవిశంకర్ సెటైర్లు వేశారు. తమ సొంత సినిమాలు లేదా తమకు అనుకూలమైన పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు శిరీష్‌కు ఎగ్జిబిటర్ల కష్టాలు గుర్తుకు రావని, కానీ ఇతర హీరోల భారీ సినిమాలు విడుదలవుతున్న తరుణంలోనే ఇలాంటి సమస్యలను తెరపైకి తెస్తారని ఆయన మండిపడ్డారు. గతంలో 'వార్ 2', 'ఓజీ', 'కూలీ' వంటి సినిమాలు వచ్చినప్పుడు ఈ పర్సంటేజీ నిబంధన ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు.

'పెద్ది' సినిమాపై కుట్ర జరుగుతోందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదల త్వరలో ఉండటంతో, ఈ వివాదాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్‌కు వ్యతిరేకంగా కొంతమంది నిర్మాతలు, ఎగ్జిబిటర్లు గ్రూపులుగా ఏర్పడి, సినిమా వసూళ్లకు గండి కొట్టేందుకే ఈ సమయాన్ని ఎంచుకున్నారా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. "మీ సినిమా లేని సమయం చూసి, వేరే వాళ్ళ పెద్ద సినిమా (పెద్ది) వస్తున్నప్పుడు ఇలా అడగడం బ్లాక్ మెయిలింగ్ కాదా?" అని నిర్మాతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
కేవలం లాభాల్లో వాటా అడగడమే తప్ప, థియేటర్ల నాణ్యతను పెంచడంపై ఎగ్జిబిటర్లు దృష్టి పెట్టడం లేదని నిర్మాతలు విమర్శిస్తున్నారు. ముక్కు మూసుకోకుండా టాయిలెట్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న థియేటర్లలో ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పర్సంటేజీ అడగడం ఏంటని రవిశంకర్ ప్రశ్నించారు. టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ అయితే జనం ఆటోమేటిక్‌గా వస్తారని, దానికి తమ విమల్ థియేటరే ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయం
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీలో హీరోల మధ్య లేదా నిర్మాణ సంస్థల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక హీరో సినిమాను ఇబ్బంది పెట్టడానికి మరొక హీరో వర్గం వెనక ఉండి నడిపిస్తోందా? అనే చర్చ మొదలైంది. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చాలని చూడటం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది ఇండస్ట్రీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications