CBSE: స్కూల్స్ కు సీబీఎస్ఈ డెడ్ లైన్- బుక్స్ లేకపోయినా అమలు చేయాల్సిందే..!
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలలకు ఇవాళ భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా జాతీయ విద్యావిధానం ప్రకారం పాఠ్యప్రణాళిక అమలుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రాథమిక విద్యాబోర్డు సీబీఎస్ఈ (CBSE) ఇవాళ పాఠశాలలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఆరో తరగతి విద్యార్ధులకు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇవాళ స్కూల్స్ కు జారీ చేసిన సర్కులర్ ప్రకారం ఆరో తరగతి విద్యార్ధులకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరిగా మూడో భాషను అమలు చేయాల్సి ఉంటుంది. అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు ఏడు రోజుల్లోగా దీనిని అమలు చేయాలని బోర్డు ఆదేశించింది. ఇది అత్యవసరం, తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది. పాఠ్యపుస్తకాలు ఇంకా అందుబాటులో రానప్పటికీ, అన్ని పాఠశాలలు వెంటనే దీని అమలును ప్రారంభించాలని బోర్డు సూచించింది. ఇప్పటికే చాలా స్కూల్స్ మూడో భాష అమలు చేస్తున్నాయని, మిగిలిన స్కూల్స్ కూడా వెంటనే అమలు చేయాలని బోర్డు సర్కులర్ లో పేర్కొంది.

అధికారిక పాఠ్యపుస్తకాలు విడుదలయ్యే వరకు, స్థానికంగా లభించే సామగ్రిని ఉపయోగించి వెంటనే మూడవ భాషను బోధించడం ప్రారంభించాలని పాఠశాలలను సీబీఎస్ఈ ఆదేశించింది. మూడో భాష పాఠ్యపుస్తకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, అయినప్పటికీ స్థానికంగా లభించే పుస్తకాలు/సామగ్రిని ఉపయోగించి, 6వ తరగతి నుండే మూడో భాష బోధనను వెంటనే ప్రారంభించాలని పాఠశాలలను ఆదేశించింది.

పాఠశాలలు తాము ఎంచుకున్న మూడవ భాషను అధికారికంగా తెలియజేసి, దానిని OASIS పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ అమలు ప్రక్రియను ప్రాంతీయ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయని కూడా పేర్కొంది. అలాగే సీబీఎస్ఈ ముందస్తు అమలును భవిష్యత్ సబ్జెక్టుల ఎంపికలతో ముడిపెట్టింది. ఆరవ తరగతి స్థాయిలో ప్రవేశపెట్టిన భాషలను మాత్రమే తరువాత అందిస్తామని పేర్కొంది. ఒక పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశపెట్టిన మూడో భాషలు మాత్రమే ఆ పాఠశాలలో 9వ మరియు 10వ తరగతులలో ఐచ్ఛికాలుగా అందుబాటులో ఉంటాయని సర్క్యులర్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications