Mid-Day Meals: ఏపీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం-లక్షన్నర మందికి లబ్ది..!
ఆంధ్రప్రదేశ్ లో కాలేజీ విద్యార్ధులకు ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్న భోజన పథకం అమలును ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న 475 ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న లక్షన్నర మంది విద్యార్ధులకు ప్రయోజనం కల్పించేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్య,ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ పథకాన్ని తమ ప్రాంతాల్లో ప్రారంభించారు.
రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్కూలు విద్యార్ధులతో పాటు కాలేజీల్లో చదువుకునే విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాలేజీల్లో ఈ పథకం అమలు చేయకుండా పక్కనబెట్టేసింది. దీంతో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని కాలేజీలకూ వర్తింపచేయాలని నిర్ణయించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని అన్నపూర్ణగా పేరున్న డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేయాలని సూచించారు. దీంతో ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా దీని పేరు మార్చింది.

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.29.39 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్దిక సంవత్సరం కోసం బడ్జెట్ లో రూ.85.84 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. స్కూలు విద్యార్ధులకు కేటాయిస్తున్న మొత్తం దీనికి అదనం. మరోవైపు డొక్కా సీతక్క మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. విద్యార్ధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ అని, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు.
డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని, కాబట్టి బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్ధుల్ని లోకేష్ కోరారు. మీలో ఒక్కడిగా తననూ భావించి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.












Click it and Unblock the Notifications