AP DSC 2024: ఏపీ డీఎస్సీలో ఎస్జీటీ అభ్యర్ధులకు హైకోర్టు గుడ్ న్యూస్- ఆ రూల్ పై స్టే..!
ఏపీలో తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉన్న ఓ నిబంధన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న డీఈడీ అభ్యర్ధు పాలిట శాపంగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. దానికి విరుద్దంగా ఏపీ ప్రభుత్వం డీఎస్సీలో దాన్ని పొందుపరిచింది. దీనిపై దాఖలైన పిటిషన్ పై నిన్న, ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. స్టే ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులను అనుమతించడంపై హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ లో అనుమతి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనిపై ఇవాళ విచారణలో ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం విన్న హైకోర్టు.. సంతృప్తి చెందలేదు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొన్న సదరు నిబంధనపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నిన్నటి విచారణలో హైకోర్టు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్ధుల్ని అనుమతించే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వంతో మాట్లాడి వాదనలు వినిపిస్తామని ఏజీ శ్రీరామ్ కోరడంతో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ విచారణలో ప్రభుత్వ వాదనతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. చివరికి ఏజీ శ్రీరామ్ కూడా బీఈడీ అభ్యర్ధులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించబోమని హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులను అనుమతిస్తున్న నిబంధనపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్న బీఈడీ అభ్యర్ధుల నిబంధనపై స్టే విధించిన హైకోర్టు.. డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగించాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఆరు లక్షల మందికి పైగా ఎస్జీటీ అభ్యర్ధులకు న్యాయం జరగనుంది.












Click it and Unblock the Notifications