కోడింగ్ తెలిస్తే సరిపోదు! ఏఐ కాలంలో బీటెక్ కంటే ఎంబీఏకే ఎందుకంత క్రేజ్?
మన దేశంలో ప్రస్తుతం ఇంజనీర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంటర్ చదివేసి, అర్జంట్ గా జేఈఈ లేదా ఎంసెట్ పరీక్షలు రాసేసి, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పట్టేస్తే చాలు. కెరీర్ సెట్ అయిపోయిందన్న భావన విద్యార్దులతో పాటు తల్లితండ్రుల్లోనూ ఉంది. దేశంలో దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాలకు సాఫ్ట్‌వేర్ రంగం లేదా బీటెక్ డిగ్రీ ఒక సురక్షితమైన కెరీర్ మార్గంగా ఉంది. అయితే ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు కొత్త ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేటి కాలంలో కేవలం టెక్నికల్ నైపుణ్యాల కంటే వ్యాపార దృక్పథం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.
వ్యాపార రంగంలో వస్తున్న పెను మార్పుల వల్ల కంపెనీలు కేవలం కోడింగ్ లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యం మాత్రమే కాకుండా విస్తృత సాంకేతికతను సంస్థ ప్రయోజనాల కోసం ఎలా విజయవంతంగా వాడాలో తెలిసిన వారి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఇదే విషయాన్ని డెలాయిట్ ఇండియా ప్రచురించిన 'క్యాంపస్ వర్క్‌ఫోర్స్ ట్రెండ్స్ 2026' నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ప్లేస్‌మెంట్స్ సీజన్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే ఎంబీఏ పట్టభద్రులు (B.Tech vs MBA) తమ ప్రారంభ జీతాలలో ఏకంగా 52 శాతం ఎక్కువ ప్యాకేజీలను అందుకున్నారు. గత విద్యాసంవత్సరంలో ఈ తేడా 47 శాతంగా ఉండగా, 2027 నాటికి ఇది మరింత పెరిగి 59 శాతానికి చేరుకుంటుందని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది.

మారుతున్న కాలంలో ఎంబీఏకు ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి కృత్రిమ మేథ (ఏఐ) కీలక కారణమని నిపుణులు చెప్తున్నారు. ప్రోగ్రామింగ్ రాయడం, డేటా బేస్ విశ్లేషించడం వంటి సాంకేతిక కార్యకలాపాలను ఏఐ అప్లికేషన్లు వేగంగా పూర్తి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో కంపెనీలకు కేవలం సాంకేతిక సామర్థ్యం ఉన్న ఉద్యోగుల కంటే వ్యాపార అవసరాలను గుర్తించగల, ఏఐ సాధనాలను లాభదాయకంగా మార్చగల మేనేజ్‌మెంట్ నిపుణుల అవసరం పెరిగింది. డెలాయిట్ సర్వే ప్రకారం సుమారు 250 సంస్థలు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే నియామకాలలో సరికొత్త శైలి పరిశ్రమల్లో కనిపిస్తోంది.

ఏఐ, డేటా నైపుణ్యాలు కలిగిన ఎంబీఏ అభ్యర్థులకు 20 నుంచి 25 శాతం అదనపు జీతాలు లభిస్తుండగా, విశ్లేషణ , సమస్య పరిష్కార సామర్థ్యాలు ఉన్న వారికి 10 నుంచి 15 శాతం ప్రీమియం ప్యాకేజీలు అందుతున్నాయి. కేవలం డిగ్రీలతో పని కాకుండా భవిష్యత్తులో ఉద్యోగుల అవసరాలు ఎలా మారుతున్నాయో ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఎంబీఏ లేదా బీటెక్ మధ్య ఉన్న ఈ పోటీ కేవలం డిగ్రీల యుద్ధం కాదు, రేపు ఆఫీసుల్లో కేవలం నైపుణ్యాలను నిరంతరంగా పెంచుకునే నేర్చుకునేవారినే విజయం వరిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటూ వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకునే ఇంజినీర్లు కానీ, టెక్నాలజీ సామర్థ్యాలను బాగా అర్థం చేసుకునే ఎంబీఏ నిపుణులు కానీ మాత్రమే మారుతున్న ఉద్యోగ మార్కెట్లో తిరుగులేని నాయకులుగా ఎదిగే అవకాశాలున్నాయి.














Click it and Unblock the Notifications