CBSE Class 12 Re-Test: మళ్లీ 12వ తరగతి పరీక్షలు ? తప్పులు ఒప్పుకున్న బోర్డు..!
ఈ ఏడాది కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు నిర్వహించిన 12వ తరగతి (CBSE Class 12) పరీక్షలు వివాదాస్పదమయ్యాయి. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షల నిర్వహణలో సీబీఎస్ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు వారి తల్లితండ్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈసారి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో చోటు చేసుకున్న తప్పిదాలను తొలుత అంగీకరించని సీబీఎస్ఈ.. సోషల్ మీడియాలో బాధితులు పెట్టిన పోస్టులు వైరల్ కావడంతో స్పందించక తప్పలేదు. చివరికి తప్పులు అంగీకరించిన బోర్డు.. ఇప్పుడు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తుందన్న ప్రచారం మొదలైంది.
తాజాగా నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కావడం, దాన్ని కూడా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తొలుత లేదని బుకాయించడం, చివరికి పరీక్షను రద్దు చేయడం జరిగిపోయాయి. ఇప్పుడు సీబీఎస్ఈ కూడా అదే బాటలో తప్పులు అంగీకరిస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో విద్యార్ధుల మూల్యాంకనంలో చోటు చేసుకున్న తప్పిదాలను అంగీకరించడంతో .. వీటి ప్రభావం ఇతర విద్యార్ధుల మీద పడకుండా ఉండాలంటే మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు మొదలయ్యాయి.

పోర్టల్ క్రాష్‌లు, పునఃమూల్యాంకన గందరగోళం మధ్య ఫిజిక్స్, కెమిస్ట్రీ జవాబు పత్రాలు తారుమారు అయ్యాయని సీబీఎస్ఈ అంగీకరించడంతో 17 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులందరికీ సరైన జవాబు పత్రాలు అందలేదని అర్ధమవుతోంది. ఒక విద్యార్థికి వేరొకరి జవాబు పత్రాలు అందినప్పుడు, ఇతరులకు కూడా అలా జరిగి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే 13న వెలువడ్డాయి. గత వారం రోజులుగా ఫలితాల తర్వాత సాధారణంగా జరగాల్సిన ప్రక్రియ కాస్తా .. సీబీఎస్ కి చుక్కలు చూపిస్తోంది. స్కాన్ చేసిన జవాబు పత్రాలను పొందడానికి లేదా ధృవీకరణ పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులు, క్రాష్ అవుతున్న పోర్టల్‌లు, విఫలమైన చెల్లింపులు, అందుబాటులో లేని లింక్‌లు, ఆలస్యమైన అప్‌లోడ్‌లతో సతమతం అవుతున్నారు. దీంతో మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంలో సీబీఎస్ఈ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications