Beard Issue: గడ్డం వివాదానికి ఫుల్‌స్టాప్.. కర్ణాటక కాలేజీ కీలక ప్రకటన
Karnataka News: ఈ మధ్య కర్ణాటకలో ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని పలు సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. IT కంపెనీలు, స్థానికులకు ఉద్యోగాల్లో కోటా వంటి పలు అంశాలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా ఇటీవల మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. విద్యార్థుల డ్రెస్ కోడింగ్ సహా బాడీ మెయింటెనెన్స్ మీద తలెత్తిన వివాదం సమసిపోయినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థులు గడ్డం ఉంచుకోవడంపై చెలరేగిన వివాదం పరిష్కారమైనట్లు కళాశాల సిబ్బంది తెలిపారు. కళాశాల గ్రూమింగ్ విధానాలను సవాలు చేస్తూ CM సిద్ధరామయ్యకు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ రాయడంతో వివాదం ప్రారంభమైంది. హసన్ జిల్లా హోలెనరసిపురంలోని నర్సింగ్ కాలేజీలో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి సదరు విద్యార్థులు అందులో ప్రస్తావించారు. కళాశాల యాజమాన్యంతో చర్చల అనంతరం విద్యార్థులు డ్రెస్ కోడ్ మరియు గ్రీమింగ్ మార్గదర్శకాలను పాటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

కళాశాల నిబంధనలు కశ్మీరీ విద్యార్థులను గడ్డం ట్రిమ్ చేసుకోవాలని కోరుతున్నట్లు అసోసియేషన్ ఆరోపించింది. గడ్డంతో ఉన్న విద్యార్థులు క్లినికల్ విధుల్లో గైర్హాజరుగా గుర్తించబడుతున్నారని, తద్వారా వారి హాజరు మరియు అకడమిక్ రికార్డులు ప్రభావితమవుతున్నాయని పేర్కొంది. విద్య కోసం వ్యక్తిగత విశ్వాసాలను మార్చుకోవాల్సిన పరిస్థితి రానీయవద్దని పేర్కొంది. ఇది విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేసింది.
హసన్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రాజన్న ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పరిశుభ్రమైన దుస్తులు ధరించి క్లినికల్ విధుల్లో పాల్గొనాలని మాత్రమే విద్యార్థులకు సూచించామని వివరించారు. ఈ విషయం గురించి వారితో మాట్లాడిన తరువాత అందుకు అంగీకరించినట్లు స్పష్టం చేశారు. కాలేజ్ అధికారులు హాస్టల్‌ను సందర్శించి సలహాలు ఇవ్వడంతో 40 మంది కశ్మీరీ విద్యార్థులు కళాశాల నిబంధనలకు అనుగుణంగా ఉన్నారని, ప్రతిపాదించిన పరిష్కారంతో వారు తృప్తిచెందినట్లు వివరించారు. తమ మార్గదర్శకాలు వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయకుండా, విద్యా వాతావరణంలో సానుకూలతను పెంపొందించేలా ఉంటాయని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications